కోక్‌ దొంగలెవరు..? | - | Sakshi
Sakshi News home page

కోక్‌ దొంగలెవరు..?

Dec 2 2025 8:32 AM | Updated on Dec 2 2025 8:32 AM

కోక్‌ దొంగలెవరు..?

కోక్‌ దొంగలెవరు..?

నాసిరకం కోక్‌ కొనుగోలు చేస్తున్నట్లు

ఆరోపణలు

ఈ ఏడాది జూన్‌ నుంచి

బయటి మార్కెట్‌లో కొనుగోలు

2024లో మొత్తం ఉత్పత్తిలో 63 శాతం

ముడి ఖనిజం ఖర్చు

ఈ ఏడాది 75 శాతం పెరగడంతో

నష్టాల ఊబిలో స్టీల్‌ప్లాంట్‌

బ్లాస్ట్‌ఫర్నేస్‌ నిర్వహణ ఖర్చు రూ.15 కోట్ల

నుంచి రూ.85 కోట్లకు పెంపు

ప్లాంట్‌లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ

విచారణకు కార్మిక సంఘాల డిమాండ్‌


సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ వైపు చకచకా అడుగులు వేస్తూ.. ప్లాంట్‌ నిర్వీర్యానికి యాజమాన్యంతో కలిసి కుట్రలు పన్నుతున్నాయి. కోక్‌ కొనుగోళ్ల వ్యవహారంలో గోల్‌ మాల్‌ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి బయట మార్కెట్‌లో కోక్‌ కొనుగోళ్లు చేస్తుండటం వెనుక భారీ స్కామ్‌ జరుగుతోందని వాదనలున్నాయి. ప్రపంచంలో ఏ ప్లాంట్‌లో లేని విధంగా ముడిఖనిజం ఖర్చు విలువ రోజు రోజుకీ పెరిగిపోతోంది. రా మెటీరియల్‌ ఖర్చు ఏడాది కాలంలో 63 నుంచి 75 శాతానికి పెరగడం వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్లాంట్‌లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సీబీఐ విచారణకు పట్టుబడుతున్నారు.

నాణ్యత పరిశీలన లేకుండా కొనుగోళ్లు..!

స్టీల్‌ప్లాంట్‌ ఏటా దాదాపు 2.7 లక్షల టన్నుల కోల్‌ కొనుగోలు చేస్తుంటుంది. ఆస్ట్రేలియా, అమెరికా, ఇండోనేషియా, అమెరికా దేశాల నుంచి నాణ్యమైన కోకింగ్‌ కోల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఆస్ట్రేలియాలో కోల్‌ కొనుగోలు వల్ల అధిక భారం పడుతుందనే ఉద్దేశంతో ఈ ఏడాది మొదటి నుంచి ఆపేశారు. ఇదే అదనుగా కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. మన దేశంలో ఉన్న లోకల్‌ కంపెనీల నుంచి బొగ్గు కొనుగోళ్లు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి బొగ్గు కొనుగోలు చేసే ముందు నాణ్యత నిర్ధారణకు 10 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మధ్య కొనుగోలు చేసిన కోల్‌కు కొన్ని టెస్టులు చేయగా.. ఇది నాణ్యమైన కోల్‌ కాదని నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి.. కొందరు అధికారులు స్థానిక కంపెనీలతో చేతులు కలిపి.. నాసిరకం బొగ్గుని కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపణలొస్తున్నాయి. 2025 జూన్‌ వరకు రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల్లో రోజుకు 15 వేల టన్నుల చొప్పున 100 శాతం ఉత్పత్తి చేశారు. అయితే... జూన్‌ నుంచి ఉత్పత్తి 67 శాతానికి క్షీణించిందనీ.. దీనికి కారణం బయట మార్కెట్‌ నుంచి నాసిరకం కోక్‌ కొనుగోళ్లేనని తెలుస్తోంది.

సీబీఐ విచారణ చేపట్టాల్సిందే..

స్టీల్‌ ప్లాంట్‌లోని ‘కోక్‌ ఓవెన్‌’ డిపార్టుమెంట్‌లో గత 35 సంవత్సరాల్లో ఎన్నడూ వాడని నాసిరకం కోక్‌ను వాడుతున్నారు. దీనివల్ల నాణ్యతలేని స్టీల్‌ ఉత్పత్తి అవుతోంది. అందుకే కొనుగోలుదారులు తిరస్కరిస్తున్నారు. ఇప్పటివరకూ నాణ్యత గల స్టీల్‌ని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి చేస్తుందనే బ్రాండ్‌ నేమ్‌ని తాత్కాలిక సీఎండీ చెడగొడుతున్నారు. నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసే కోకింగ్‌ కోల్‌ బదులు మార్కెట్‌లో నాసిరకం కోక్‌ను కమీషన్ల కోసం కొనుగోలు చేస్తున్నారు. విశాఖ ఉక్కుకు మార్కెట్‌లో ఉన్న మంచిపేరును దెబ్బతీయడానికే ఇలా వ్యవహరిస్తున్నారు.

– సీహెచ్‌ నర్సింగరావు, స్టీల్‌ప్లాంట్‌ జేఏసీ చైర్మన్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement