ముడి ఖనిజంలోనూ హస్తలాఘవం!
ఓవైపు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లకుండా ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు నిరంతరం పోరాటాలు చేస్తుంటే.. సందట్లో సడేమియా అన్నట్లుగా.. కొందరు ఉన్నతాధికారులు దొరికిన కాడికి దోచుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు. కోక్ కొనుగోళ్లలోనే కాకుండా రా ఓర్ ఖర్చు విషయంలోనూ హస్తలాఘవం చూపిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024లో మొత్తం ఉత్పత్తిలో ముడి ఖనిజాల ఖర్చు 63 శాతం ఉండగా.. 2025లో ముడి ఖనిజాల ఖర్చు 75 శాతానికి అమాంతంగా పెరిగింది. ప్రపంచంలో ఏ స్టీల్‌ప్లాంట్‌లోనూ ముడిఖనిజం ఖర్చు ఈ స్థాయిలో లేదని వివిధ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. సెయిల్‌లో ముడిఖనిజం ఖర్చు సుమారు 50 శాతంగా ఉంటే.. స్టీల్‌ప్లాంట్‌లో ఇంత పెద్దమొత్తంలో ఒక్కసారిగా ఎందుకు పెరిగిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతేకాకుండా.. ఉత్పత్తి వ్యయంలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింటర్ ప్లాంట్‌లో 2 మిషన్లు నడపడానికి గతంలో రూ.19 కోట్లు వ్యయం ఉండగా.. ఇప్పుడది రూ.45 కోట్లకు పెంచేశారు. అదేవిధంగా.. బ్లాస్ట్‌ఫర్నేస్ మెయింటెనెన్స్ పనులకు గతంలో రూ.15 కోట్లు కాగా.. ఇప్పుడు అమాంతంగా రూ.85 కోట్లకు పెంచేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. స్టీల్‌ప్లాంట్‌లో జరుగుతున్న ఈ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ విచారణ చేపట్టాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.


