చెరువు కాపాడాలంటూ నిరశన దీక్ష
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లి సర్వే నంబరు 286లో 3.27 ఎకరాల చెరువు భూమిని అధికారులు ఓ వ్యక్తి పేర నమోదు చేశారని, వెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ పెదపల్లి, మంత్రిపాలెం, పెద గొల్లలపాలెం గ్రామాలకు చెందిన యువకులు బొద్దపు శివ, పడాల నగేష్, బొద్దపు రాజా సోమవారం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. గతంలో 22ఏ జాబితాలో ఉన్న ఆ భూమిని ఈ ఏడాది మేలో ఆ జాబితా నుంచి తొలగించారని యువకులు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాల నుంచి 22ఏ జాబితాలో ఉన్న ఆ భూమిని డీనోటిఫై చేయడం వెనక కింది స్థాయి అధికారుల తప్పు ఉందన్నారు. దీనిపై ఎన్నోసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని, అందుకే నిరాహార దీక్షకు దిగినట్టు వారు విలేకరులకు తెలిపారు. సోమవారం స్థానిక తహసీల్దార్‌కు ఈ విషయమై వినతిపత్రం ఇవ్వడానికి వెళితే దురుసుగా సమాధానం చెప్పారని ఆరోపించారు. చెరువు భూమిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆక్రమణదారుల గుప్పిట్లోకి వెళ్లనీయమని స్పష్టం చేశారు. యువకుల ఆందోళనకు పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొద్దపు ఎర్రయ్యదొర, స్థానిక నాయకులు దాసరి కుమార్, కోడిగుడ్డు రమణ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, పలువురు యువకులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు.
చెరువు కాపాడాలంటూ నిరశన దీక్ష


