విద్యతోనే సమాజాభివృద్ధి
స్పీకరు అయ్యన్నపాత్రుడు
డి.యర్రవరంలో బాలికల వసతి గృహం భవనాన్ని ప్రారంభిస్తున్న స్పీకరు అయ్యన్నపాత్రుడు
నాతవరం: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలో డి.యర్రవరం హైస్కూల్‌లో రూ.1.95 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహం, రూ.23 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ముందుగా గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. సర్పంచ్ ఇనపసప్పల సత్యవతి అధ్యక్షతన హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న మాట్లాడారు. చదువు ఒక్కటే ఆ మనిషి బతికున్నంత కాలం వారితోనే ఉంటుందన్నారు. అభివృద్ధి కోసం తాను నిధులు తేస్తే తమ నాయకులు గ్రామాల్లో గ్రూపులుగా ఏర్పడి పనుల సకాలంలో చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో వి.వి.రమణ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టరు రాజాన వీర సూర్యచంద్ర. టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, తహసీల్దార్ మహేష్, ఎంపీడీవో శ్రీనివాస్, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ, వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.


