స్టీల్‌ప్లాంట్‌లో ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ ప్రారంభం
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఆదివారం నుంచి ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఉత్పత్తి విభాగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో భాగంగా ప్లాంట్‌లోని ఈడీ (వర్క్స్) బిల్డింగ్ ముందు తొమ్మిది జెండా స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటిపై ప్రధాన విభాగాలుగా పరిగణించే ఆర్‌ఎంహెచ్‌పీ, కోక్ ఓవెన్స్, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్–1, స్టీల్ మెల్ట్ షాప్–2, సీఆర్‌ఎంపీ, మిల్స్, ధర్మల్ పవర్ ప్లాంట్ పేరిట తొమ్మిది రంగుల పతాకాలను అమర్చారు. ప్రతీ రోజు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్న విభాగం పతాకం ఎత్తులో ఎగురుతుంది. లక్ష్య శాతం ఆధారంగా ఆ పతాకం ఎత్తు స్థాయిని నిర్ణయిస్తారు. అంటే లక్ష్యాన్ని ఎంత శాతం చేరుకుంటే, పతాకం అంత ఎత్తులో ఎగురుతుంది. శనివారం ఆయా విభాగాలు సాధించిన ఉత్పత్తి సాధన ఆధారంగా ఆదివారం తొలి రోజు పతాకాలను ఏర్పాటు చేశారు. యాజమాన్యం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఉద్యోగులు ఈ కొత్త పద్ధతి వల్ల విభాగాల మధ్య పోటీ కంటే, అనవసరమైన పరస్పర విమర్శలు పెరిగి, అది మొదటికే మోసం తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


