కొబ్బరి అధరహో... | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి అధరహో...

Nov 3 2025 7:00 AM | Updated on Nov 3 2025 7:00 AM

కొబ్బ

కొబ్బరి అధరహో...

కొబ్బరి కాయకు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పెరిగింది. కొంత కాలంగా పతనమైన ధరలో దీపావళి, దసరా పండగలు, కార్తీకమాసం కారణంగా మార్పువచ్చింది.

కొబ్బరి అధరహో...

నక్కపల్లి: కొబ్బరి ధర అదర గొడుతోంది. దీంతో రైతులు లాభాల బాట పట్టారు. గతంలో నష్టాలను చవిచూసిన రైతులు ధరపెరగడంతో మూడు నెలల నుంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి బొండాలు, కాయల ధర ఆశాజనకంగా ఉంది. ఆరుగాలం శ్రమించి కొబ్బరి సాగు చేసిన రైతులు గతంలో నష్టాల్లో కొట్టుమిట్టాడారు. అయితే ఇటీవల కొబ్బరి ధర అమాంతం పెరిగింది. ధరపెరిగినప్పటికీ తెల్లదోమ కారణంగా దిగుబడి తగ్గిపోతోందని, ధరపెరిగిందని ఆనందించాలో, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గుతోందని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో కొబ్బరి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏది ఏమైనా గడచిన మూడు నెలల నుంచి పెరిగిన ధరమాత్రం రైతులకు ఊరటనిస్తోంది,

ఐదేళ్లూ అనేక ఇబ్బందులు

ప్రస్తుతం ధర భారీగా పెరిగి, కొబ్బరి రైతులు సంతోషంగా ఉన్నప్పటికీ, గత ఐదేళ్లలో అనేకసార్లు ఇబ్బందులు పడ్డారు. తెల్లదోమ వల్ల దిగుబడులు తగ్గడంతో పాటు ధరల పతనంకావడం రైతుల్ని కుంగదీసింది. ప్రస్తుతం తెల్లదోమ సోకినా భారీగా ధర పెరిగింది. దీంతో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొబ్బరి దీర్ఘకాలికపంట. ఏడాది పొడవునా ఫలసాయం చేతికి వస్తుంది. గ్రామీణ జిల్లాలో దాదపు 18 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలు మరో కోనసీమగా ప్రసిద్ధిగాంచాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి, అచ్యుతాపురం, పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. తీరప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతాల్లో రైతులు కొబ్బరి అధికంగా పండిస్తున్నారు. లక్షలాదిటన్నుల కొబ్బరి కాయలు ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఎగుమతి అవుతుంటాయి.

తెగుళ్లు లేకపోతే ఎకరాకి 7,000 నుంచి 7,500 వరకూ కాయల దిగుబడి వస్తుంది. తెల్లదోమ కారణంగా ప్రస్తుతం 6,000 కాయల దిగుబడివస్తోందని ఉద్యాన వన శాఖాధికారులు, కొబ్బరి రైతులు చెబుతున్నారు. దసరా సీజన్‌లో భవానీ దీక్షలు చేపట్టిన వారు, అయ్యప్ప, శివ మాలలు ధరించిన వారు ఎక్కువగా కొబ్బరి కాయలు వినియోగిస్తున్నారు. పండగల సీజన్‌, కార్తీక మాసం కావడంతో కొబ్బరి ధర పెరిగింది. గతంలో ఒక్కో కొబ్బరి బొండాంను రైతునుంచి వ్యాపారులు రూ.10 నుంచి రూ.15లకు కొనుగోలుచేసేవారు, అలాగే ఒక్కో కొబ్బరి కాయను కనిష్టంగా రూ.8 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేసే వారు. గడచిన మూడు నెలల నుంచి రైతు వద్ద నుంచి బొండాం సైజు బట్టి ఒక్కొక్క దానిని రూ. 25 నుంచి రూ.30 వరకూ కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరికాయల సైజు బట్టి రూ.25 నుంచి రూ.30 వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఇదే బొండాలను బయట మార్కెట్లో రూ.40, కొబ్బరి కాయలు రూ.40 నుంచి రూ.50 వరకూ విక్రయిస్తున్నారు. ఏడాది కిందట కాయ రూ.9 నుంచి రూ.12 వరకూ కొనుగోలు చేసేవారు. ధరలు అమాంతం పెరగడం, కొబ్బరి కాయల వినియోగం కూడా ఎక్కువ కావడంతో ఇటు రైతులకు, అటు వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. గతంలో కొబ్బరికాయ ధర రూ.5 వరకూ పడిపోయిన సందర్భాలున్నాయని రైతులు తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఈప్రాంతాల్లో పండించిన కొబ్బరి కాయలను బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, విశాఖపట్నం, హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. కొబ్బరి తీత, తొక్క వలవడం, ప్యాకింగ్‌ ఎగుమతులు ఖర్చులు పోను ఒక్కొక్క కాయకు రూ.10 వరకూ మిగులుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

దళారుల కనుసన్నల్లో

కొబ్బరి ధరను రైతులు నిర్ణయించే పరిస్థితి లేదు. కొంతమంది కమీషన్‌ వ్యాపారులు నిర్ణయించిన ధరకే ఇవ్వాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. పండించిన కొబ్బరిని నేరుగా అమ్ముకునే అవకాశాలు లేకపోవడంతో కమీషన్‌ దుకాణాలకు విక్రయించాల్సి వస్తోంది.

మార్కెటింగ్‌ సదుపాయం లేదు...

ఇంత భారీ స్థాయిలో కొబ్బరి సాగుచేస్తుంటే సరైన మార్కెటింగ్‌ సదుపాయంలేదు. ప్రభుత్వం తరఫున ఈప్రాంతంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు లేవు. దీంతో నిర్ణీత ధర అంటూ ఉండటం లేదని రైతులు చెబుతున్నారు.

ధర్మవరం, కొరుప్రోలు కేంద్రంగా ఎగుమతులు..

ఎస్‌.రాయవరం మండలం ధర్మవరం, కొరుప్రోలు, కేంద్రాలుగా కొబ్బరి ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ఎస్‌.రాయవరం మండలంలో కొబ్బరి వ్యాపారులు చిన్నా చితకా కలిపి సుమారు 300 మంది వరకు ఉంటారు. వీరిలో కొంతమంది రైతులే. మరికొంతమంది రైతులనుంచి కాయలు కొనుగోలుచేసి ఇతరప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు. ఇక్కడనుంచి రోజూ లక్ష కొబ్బరికాయలు విశాఖ, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, మహారాష్ట్ర, బిహార్‌, మధ్యప్రదేశ్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, తిరుపతి, కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. నక్కపల్లి మండలంలో పెదతీనార్ల, చినతీనార్ల, డీఎల్‌పురం, సీహెచ్‌ఎల్‌ పురం, జానకయ్యపేట, రాజయ్యపేట, బోయపాడు, గునిపూడి, వేంపాడు, ఎస్‌.రాయవరం మండలంలో కొరుప్రోలు, రేవుపోలవరం, లింగరాజుపాలెం, గుడివాడ, బంగారమ్మపాలెం, సర్వసిద్ధి, వాకపాడు, పెద ఉప్పలం, బీమవరం,పెనుగొల్లు,గెడ్డపాలెం, వమ్మవరం,సైతారుపేట రాంబిల్లి మండలంలో రాంబిల్లి, దిమిలి తదితర ప్రాంతాల్లో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. కొబ్బరి ఎక్కువగా పండించే ఎస్‌.రాయవరం మండలంలో కొబ్బరి అనుబంధపరిశ్రమలు సుమారు 30 వరకు ఉన్నాయి. పీచు తాళ్లు ఇక్కడ తయారు చేసి ఎగుమతి చేస్తుంటారు.

తొక్కతీసి

విక్రయానికి

సిద్ధంచేస్తున్న

కొబ్బరికాయలు

లాభాలు ఆర్జిస్తున్న రైతులు

జిల్లాలో 18వేల ఎకరాల్లో సాగు

వెయ్యి కాయలు హోల్‌సేల్‌లో రూ.25 వేలు

కాయ ధర రూ.40

బొండాం రూ.50

తెల్లదోమ వల్ల తగ్గుతున్న దిగుబడి

ధర ఆశాజనకం

ఇటీవల కొబ్బరి ధర బాగా పెరిగింది.అదే సమయంలో తెల్లదోమ వల్ల దిగుబడి కూడా తగ్గింది. అయితే ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులకు ఊరట లభిస్తోంది. ఆరు నెలల నుంచి కొబ్బరి ధర పెరుగుతోంది. ఏడాదిక్రితం కాయ సైజు బట్టి రూ.9 నుంచి రూ.12 వరకూ కొనుగోలు చేసేవారు. దసరా సీజన్‌లో రూ.20 వరకూ పలికింది. ఇప్పుడు రైతుల వద్దకొనుబడి రూ.25 వరకూ ఉంది. రెండు నెలల నుంచి కొబ్బరికి మంచి డిమాండ్‌ ఉంది.

– ఐనంపూడి సురేష్‌ రాజు, కొబ్బరి రైతు,

వేంపాడు, నక్కపల్లి మండలం

కొబ్బరి ధరలు

వెయ్యి వెయ్యి

కాయలు బొండాలు

గత ఏడాది రూ.12 వేలు రూ.15 వేల నుంచి

రూ.18 వేలు

ఈ ఏడాది జనవరిలో రూ.18 వేలు రూ.20 వేలు

ఈ ఏడాది దసరా తర్వాత రూ.23 వేలు రూ.25 వేల నుంచి

రూ.30 వేలు

కొబ్బరి అధరహో... 
1
1/2

కొబ్బరి అధరహో...

కొబ్బరి అధరహో... 
2
2/2

కొబ్బరి అధరహో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement