సింహగిరిపై ఘనంగా చిలుకు ద్వాదశి
సింహాచలం: సింహగిరిపై ఆదివారం చిలుకు ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) ఉత్సవం వైభవంగా జరిగింది. అనకాపల్లికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులు తరలివచ్చి, తమ చేతుల మీదుగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఈ ఉత్సవాన్ని జరిపించారు. ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఆలయంలో చిలుకు ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని తరతరాలుగా అనకాపల్లిలోని గవర సామాజికవర్గానికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులకు దేవస్థానం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఆడారి నూకయ్య వంశీయులు కుటుంబ సమేతంగా చిలుకు ద్వాదశి ఉత్సవానికి సంబంధించిన పూజా ద్రవ్యాలతో వచ్చారు. సాయంత్రం ఆలయ ఆస్థాన మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు శయన పెరుమాళ్లు, ఆళ్వార్లకు విశేషంగా పూల అలంకరణ చేసి మండపంలో అధిష్టింపజేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచార పూజలు నిర్వహించారు. స్వామి చెంతన నువ్వులు, బెల్లం, పాలను రోట్లో వేసి చెరకు గెడలతో శాస్త్రోక్తంగా దంచారు. తయారైన చిమ్మిడిని స్వామికి నైవేద్యంగా ఆరగింపు చేశారు. తదుపరి శయన పెరుమాళ్లకు బేడా తిరువీధిని కనులపండువగా నిర్వహించారు. మంగళాశాసనాన్ని విశేషంగా అందించారు. భక్తులకు చిమ్మిడి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు పవన్‌కుమార్ తదితరులు పూజలు నిర్వహించారు.
స్వామి సేవలో ఆడారి వంశీయులు
సింహగిరిపై ఘనంగా చిలుకు ద్వాదశి


