
అడ్డగోలు జీవోలు.. అణచివేతకు కుట్రలు!
● ఏడాదిలోనే కూటమి ప్రభుత్వానికి భయం మొదలైంది ● పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలను నిషేధిస్తూ ఇచ్చిన జీవో ప్రజాస్వామ్య విరుద్ధం ● జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగిన ఏఐఎస్‌ఎఫ్
బీచ్‌రోడ్డు: కూటమి ప్రభుత్వానికి ఏడాది కాలంలోనే భయం మొదలైందని అందుకు నిదర్శనమే పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షుడు పి.శేఖర్ అన్నారు. ఆదివారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశం లేదని జీవో విడుదల చేయడాన్ని ఖండించారు. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, న్యాయమైన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పాఠశాలల్లోకి అనుమతించకపోవడం కూటమి నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా జీవోలు ఇస్తూ అణచివేతకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఐఎస్‌ఎఫ్ నాయకులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా విద్యార్థులకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.