
రేషన్ కావాలంటే 4 కిలోమీటర్లు నడవాలి
రావికమతం : మండలంలోని పి.కోట్నాబిల్లిలో గిరిజనులు సరుకులను కావిళ్లు మోస్తూ ఆదివారం వినూత్న నిరసన తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ విధానానికి కుటమి సర్కార్ మంగళం పాడడంతో రావికమతం మండలంలో పి.కొట్నాబిల్లి గ్రామ గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్లు నడిచి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందని, సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో తలపై రేషన్ సరుకులు మూట మోస్తూ అష్టకష్టాలు పడుతున్నామని తెలిపారు. మండలంలో పి.కోట్నాబిల్లి గ్రామంలో కొండదొర తెగకు చెందిన 70 మంది కార్డుహోల్డర్స్ నివాసం ఉంటున్నారు. వీరు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి డోలవానిపాలెం గ్రామం నుంచి రేషన్ తెచ్చుకునేవారు. దీనిపై జూన్‌లో అధికారులకు విన్నవించగా, స్పందించిన నర్సీపట్నం ఆర్డీవో రామన్నదొరపాలెం డిపో నెంబర్ 039050 నుంచి పి.కొట్నాబిల్లి క్రియేటివిటీ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి బియ్యం సరఫరా చేయాలని సూచించారని, కానీ ఇప్పటి వరకూ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే స్టాక్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో మండల రెవిన్యూ కార్యాలయం వద్ద భారీ ఎత్తున అందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, గిరిజన సంఘం నాయకుడు పాడి బెన్నయ్య తదితరులు డిమాండ్ చేశారు.