
సానా రెచ్చిపోతున్నారు!
● ఎమ్మెల్యే సోదరుడి అనుచరుల గ్రావెల్ దందా ● భారీ యంత్రాలతో వెదురువాడలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు ● ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి పెద్ద ఎత్తున అక్రమంగా తరలింపు ● అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు, నేతలపై గూండాగిరీ ● చోద్యం చూస్తున్న ఏపీఐఐసీ, మైనింగ్, రెవెన్యూ అధికారులు ● ఏపీఐఐసీ అధికారికి రోజు వారి మామ్మూళ్లు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. కన్నుమిన్నుకానకుండా రెచ్చిపోతున్నారు. కొండలను తవ్వి పిండి చేస్తున్నారు. చెరువులను గుల్ల చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. మామూళ్లతో అధికారుల కళ్లకు గంతలు కట్టి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల అండదండలతో రెచ్చిపోతున్నారు. అడ్డుకుంటున్న గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నేతలపై గూండాగిరీకి దిగుతూ, లారీలతో ఢీకొని అడ్డు తొలగించుకునేలా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతమైన అచ్యుతాపురం మండల పరిధి లో రాత్రీపగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా రోజు రోజుకూ రెచ్చిపోతోంది. అధికారుల అండ దండలతో ఇష్టానుసారంగా గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. పెద్ద పెద్ద చైన్ పొక్లెయిన్లతో యథేచ్ఛగా కొండలను పిండి చేస్తున్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే సోదరుడు సతీష్‌కుమార్ అనుచరులే దందాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ నెల 2వ తేదీ శనివారం అర్ధరాత్రి వెదురువాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్–1లో ఉన్న కొండ వద్ద నాలుగు పెద్ద పొక్లెయిన్ల (200–మిషన్ల)తో గ్రావెల్ తవ్వకాలు జరిపి, 30కి పైగా లారీలతో అక్రమంగా తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జెడ్పీ కోఆప్షన్ నర్మల్ కుమార్, మండల యువజన అధ్యక్షుడు గంగోలి శ్రీనుతో పాటు గ్రామస్తులు ఆ ప్రాంతానికి వెళ్లి లారీలను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సోదరుడి అనుచరుడు సరోజీరావు రెచ్చిపోయారని, గూండాగిరీ చేస్తూ కుమార్ తదితరులను లారీతో తొక్కించేయాలని డ్రైవర్లను ఆదేశి స్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఈ తరలింపు వెనుక స్థానిక జనసేన ఎమ్మెల్యే సోదరుడు సతీష్‌కుమార్ అనుచరుడు కొరుప్రోలు చిన్నారావు, ఆయన సోదరుడు సరోజీరావు హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు కుమార్ ఆరోపించారు. గత కొంత కాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆ ప్రాంత వాసులు తెలిపారు.
ఫిర్యాదు చేసినా..
అచ్యుతాపురం సెజ్ పరిశ్రమలను ఆనుకుని ఉన్న మడుతూరు, ఇరువాడ, యర్రవరం, ఉప్పవరం, జగన్నాథపురం, నడింపల్లి గ్రామాల్లో ఉన్న చెరువులు, కొండలను సైతం పొక్లెయిన్లతో తవ్వి గ్రావె ల్‌ను అక్రమంగా తరలించారు. మైనింగ్ ఏడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయా గ్రామస్తులు తెలిపారు.
పోలీసుల అండదండలతో..
అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే, పోలీసుల అండదండలతోనే గ్రావెల్‌ను అక్రమంగా తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. శనివారం రాత్రి 10 గంటలకు గ్రావెల్ తవ్వుతున్నట్టు ఫోన్ రావడంతో అక్కడికి జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు కుమార్, వైఎస్సార్‌సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గంగోలి శ్రీను వెళ్లి అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సోదరుడు సతీష్ కుమార్ అనుచరుడు కొరుప్రోలు సరోజీరావు గూండాగిరీ చేశాడని, లారీతో తొక్కించేయాలంటూ డ్రైవర్‌కు చెప్పి అడ్డు తొలగించేందుకు ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు హోంగార్డులు శంకరరావు, అప్పారావు ప్రేక్షకపాత్ర పోషించారే తప్ప అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలువరించలేదని చెప్పారు. అంతే కాకుండా అడ్డుకునేందుకు వచ్చిన వారిని తమ సీఐ గారికి ఫోన్ చేయాలంటూ చెప్పి మిన్నకుండిపోయారని తెలిపారు. ఈ వ్యవహారమంతా పోలీసుల అండదండలతో సాగుతోందని వారు ఆరోపించారు.
అధికారులకు ముడుపులు..!
ఎటువంటి అనుమతులు.. అడ్డూ అదుపూ లేకుండా కొండలను పిండి చేస్తున్నా మైనింగ్, పోలీస్, ఏపీఐఐసీ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. కాగా మైనింగ్, పోలీస్, రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లించి మరీ గ్రావెల్‌ను దోచుకుంటున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అనుమతుల్లేకుండా ఎక్కడ పడితే అక్కడ అక్రమార్కులు కొండలను, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఎవరైనా స్థానికులు అడ్డగిస్తే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. స్థానికులెవరైనా రెవెన్యూ, మైనింగ్, పోలీసు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. నేరుగా తవ్వకం దారులకే సమాచారం ఇచ్చి నామమాత్రంగా తనిఖీలు చేయడానికి వెళ్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
అడ్డుకున్నానని లారీతో తొక్కించి చంపే యత్నం..
ప్రతి శని, ఆదివారాల్లో రాత్రంతా భారీగా గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. అధికారుల అండదండలతోనే గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ నెల 2వ తేదీన భారీ వాహనాలతో గ్రావెల్ తవ్వుతుంటే మేము అడ్డుకున్నాం. నాపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. లారీతో తొక్కించుకుంటూ వెళ్లాలని డ్రైవర్లను ఆదేశిస్తూ గూండాగిరీకి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ గ్రావెల్ మాఫియాను అడ్డుకుని తీరతాం. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గతంలో చాలా సార్లు మైనింగ్, ఇతర అధికారులను ఫిర్యాదు చేశాం. కలెక్టర్ విజయకృష్ణన్, మైనింగ్ ఏడీ, పోలీసులు, రెవెన్యూ అధికారులను కూడా కోరుతాం. ఇక్కడ జరుగుతున్న అవినీతిపై మా పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, పార్టీ కేడర్ అంతా ఉద్యమం చేసైనా ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటాం. అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకూ మా పోరాటం, ఉద్యమం ఆగదు.
– నర్మల్‌కుమార్, జెడ్పీ, కోఆప్షన్ సభ్యుడు
రోజుకు 400 ట్రిప్‌లు..
అచ్యుతాపురం మండలం వెదురువాడ సర్వే నంబర్ 1లో గత కొన్ని రోజులుగా కూటమి ఎమ్మెల్యే సోదరుడి అనుచరులు కొండను అక్రమంగా తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. నాలుగు 200 చైన్ జేసీబీ మెషీన్లతో 30కి పైగా లారీలతో రోజుకు 400కు పైగా ట్రిప్‌లు తరలిస్తున్నారని, ఈ వ్యవహారమంతా రాత్రి పూట సాగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఒక ట్రిప్‌కు 30 టన్నుల గ్రావెల్ చొప్పున ఒక్కో లారీతో 10 ట్రిప్‌ల వరకూ అక్రమంగా తరలించేస్తున్నారని తెలిపారు. సుమారు 12 వేల టన్నుల గ్రావెల్‌ను రోజూ అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. సుమారు ఏడాది కాలంగా కొండకర్ల నుంచి గోకువాడ వరకు 10 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కొండ తవ్వి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువ చేసే గ్రావెల్ తరలించారని భోగట్టా. అంతే కాకుండా సమీపంలో గల ఎర్రవరం, జగన్నాథపురం, నడింపల్లి, మడుచూరు, వెంకటాపురం, చీమలాపల్లి గ్రామాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒక లారీ గ్రావెల్‌ను రూ.9 వేల చొప్పున విక్రయిస్తూ జేబు లు నింపుకుంటున్నారు.

సానా రెచ్చిపోతున్నారు!

సానా రెచ్చిపోతున్నారు!

సానా రెచ్చిపోతున్నారు!

సానా రెచ్చిపోతున్నారు!