
కేజీహెచ్‌కు అనారోగ్యం
● వైద్యం కోసం వస్తే.. రోగులకు వ్యథలే..
● అధికారుల మధ్య ఆధిపత్య పోరు
● ఓ పరిపాలనాధికారి పనితీరుపై విమర్శలు
● అవినీతి, వర్గ విభేదాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు
మహారాణిపేట(విశాఖ): ఉత్తరాంధ్ర జిల్లాలకే పెద్ద దిక్కుగా ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) సమస్యల వలయంలో చిక్కుకుంది. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. అయితే పెరిగిన రోగుల తాకిడికి అనుగుణంగా వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాలనా వైఫల్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఆసుపత్రిలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆసుపత్రిలో 1,187 పడకలు ఉండగా, సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 1,500 నుంచి 2,200 మంది ఓపీ టికెట్లు తీసుకుంటున్నారు. వీరిలో 300 నుంచి 600 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వార్డులు, పడకల సంఖ్యను పెంచాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు శూన్యం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా యాజమాన్యం విఫలమవుతోంది. కొన్ని చోట్ల రోగులు కుక్కలతో కలిసి ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
నిర్లక్ష్యానికి కేరాఫ్‌గా క్యాజువాలిటీ
ఆసుపత్రికే గుండెకాయ లాంటి క్యాజువాలిటీ విభాగం నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. రోడ్డు ప్రమాద బాధితులు, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనవారు ఇక్కడికి వస్తే, వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. క్షతగాత్రులు, రోగులను లోపలికి తీసుకెళ్లడానికి స్ట్రెచర్, వీల్ చైర్ కోసం కూడా బంధువులే వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. దీంతో క్షతగాత్రులు రక్తం కారుతూ.. బాధను ఓర్చుకుంటూ ఆటోల్లో, అంబులెన్స్‌ల్లో అప్పటి వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం, విసుగు ప్రదర్శిస్తుండటంతో అత్యంత విలువైన ‘గోల్డెన్ అవర్’ వృథా అయి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. ఒకవేళ రోగి మరణిస్తే, మృతదేహాన్ని గంటల తరబడి అక్కడే స్ట్రెచర్‌పై వదిలేస్తున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.
దుర్గంధభరితంగా వార్డులు
పారిశుధ్య పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో ఆసుపత్రిలోని అనేక వార్డులు కంపుకొడుతున్నాయి. రాజేంద్రప్రసాద్ వార్డు, భవానగర్ వార్డు, గైనిక్ వార్డు, పిల్లల వార్డు, ఆర్థోపెడిక్ వార్డుల్లో మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. ఎవరైనా పర్యవేక్షణ చేస్తారంటే శుభ్రం చేస్తారు. లేదంటే పట్టించుకోరు. దీంతో అపరిశుభ్ర వాతావరణంలోనే రోగులు, వారి బంధువులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
ఆధిపత్య పోరు.. అవినీతి ఆరోపణలు
ఆసుపత్రిలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఆసుపత్రిని పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ తన చాంబర్ నుంచి బయటకు రావడం గగనంలా మారింది. విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఎవరికీ అప్పగించలేదు. అడ్మినిస్ట్రేటర్‌గా వచ్చిన ఓ అధికారి పనితీరు మీద విమర్శలు వస్తున్నాయి. పరిపాలనను పట్టించుకోకుండా ఆస్పత్రిలో ఒక వర్గాన్ని చేతిలో పెట్టుకుని వివాదాలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉండటంతో పాలన గాడి తప్పింది. తరచూ విద్యుత్ అంతరాయాలు, పనిచేయని ఏసీలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణ లోపాలు, పారిశుధ్య సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఆస్పత్రికి ‘నేనే బాస్’అంటే ‘నేనే బాస్’అనే ధోరణిలో అధికారుల మధ్య నెలకొన్న పోరుతో ఇక్కడ వైద్య సేవలు, పరిపాలన అస్తవ్యస్తంగా మారాయి.
వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ
కష్టపడి ఓపీ టికెట్టు సంపాదించి సంబంధిత విభాగానికి వెళ్తే.. వైద్యుడిని సంప్రదించడానికి గంటకు పైగా సమయం పడుతోంది. క్యాజువాలిటీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ప్రసూతి, చిన్నపిల్లల వార్డు, క్రిటికల్ కేర్ విభాగం.. ఇలా ప్రతి విభాగంలోనూ వందలాది మంది రోగులు బారులుదీరి ఉంటారు. రోగులకు వైద్యం బాగానే అందిస్తున్నా.. డాక్టర్ వద్దకు చేరుకోవడానికే చాలా సమయం పడుతోంది. ఇటీవల 43 మంది వైద్యులు, 26 మంది స్టాఫ్ నర్సులు బదిలీ అయ్యారు. కొత్త నియామకాలు జరగకపోవడంతో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. పలు విభాగాల్లో విభాగాధిపతులు(హెచ్‌వోడీ) అందుబాటులో లేకపోవడంతో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో, కొన్నిచోట్ల పీజీ విద్యార్థులతో ఓపీలు నడుస్తున్నాయి. కొందరు వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

కేజీహెచ్‌కు అనారోగ్యం

కేజీహెచ్‌కు అనారోగ్యం

కేజీహెచ్‌కు అనారోగ్యం

కేజీహెచ్‌కు అనారోగ్యం