
‘ఉచిత బస్సు’ అమలు చేస్తే మా గతేంకాను
కశింకోట: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మా గతేం కావాలని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం వల్ల ఆటో, వ్యాన్, టాక్సీ తదితర మోటారు వాహనాల మీద ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నరసింగబిల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటో, మోటారు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమానికి నాయకత్వం వహించిన సీఐటీయూ జిల్లా నాయకుడు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు పేరుతో ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని క ల్పిస్తామని ప్రకటించారన్నారు. దీనివల్ల ఆటో, వ్యాన్, టాక్సీ తదితర మోటారు వాహనాల మీద ఆధారపడి జీవనం సాగించే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. పలువురు ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఆటో, వ్యాన్, టాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసి వడ్డీలు కట్టలేక, సర్వీసు లేక సతమతమవుతున్నట్టు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విడి భాగాల ధరలు, బీమా చలానాలు, టాక్స్‌లు విపరీతంగా పెరగడం, మరో పక్క పోలీసులు, ట్రాన్స్‌ఫోర్టు అధికారులు కేసులు బనాయిస్తుండటం వల్ల రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము వాటికే ఖర్చు అయిపోతుందన్నారు. ఇంటి అవసరాలకు డబ్బులేక అర్ధాకలితో కుటుంబాలు అలమటించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుందని చెప్పారు. వీటిని గుర్తించి ఆటో,మోటారు కార్మికులను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. యూనియన్ నాయకులు శివశంకర్, ఎం.వర, ఎం.శ్రీను, ఎం. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.