
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ధర్నా
తుమ్మపాల: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఉపాధ్యాయులకు అప్పగించిన బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే 12వ పీఆర్‌సీని ప్రకటించి, ఐఆర్ 30 శాతం చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయులకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి సుధాకరరావు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని యథావిదిగా కొనసాగించాలని కోరారు. ఎంఈవోలు గ్రేడ్–2 హెచ్‌ఎంలుగాను, గ్రేడ్–2 హెచ్‌ఎంలు ఎంఈవోలుగా మారేందుకు అవకాశం కల్పించాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కో–చైర్మన్ ఎ.వీహెచ్.శాస్త్రి, ఎం.జానకీరామనాయుడు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డి.చిన్నబ్బాయి, ఎస్.దుర్గాప్రసాధ్, ఆచంట రవి, కార్యవర్గ సభ్యులు శేఖర్, ధర్మారావు, ఎం.శ్రీనివాసరావు, పరదేశి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.