
కానిస్టేబుళ్లుగా కాబోయే భార్యాభర్తలు
వంతాల అశోక్, డొంకా అమ్మాజీ
రావికమతం: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. వీరిలో మండలంలో కొత్త కోట్నాబిల్లి ఎస్సీ కాలనీకి చెందిన వంతాల అశోక్ 113 మార్కులు సాధించి ఏపీ ఎస్సీ కానిస్టేబుల్‌గా,పిల్లవానిపాలెం గ్రామానికి చెందిన డొంకా అమ్మాజీ 120 మార్కులు సాధించి సివిల్ మహిళా పోలీస్‌గా ఎంపికయ్యారు.ఈ యువతీ యువకులు ఇద్దరూ మేనత్త, మేనమామ పిల్లలు,ఇద్దరికీ వివాహం నిశ్చయమైంది.పది రోజుల్లో వీరి నిశ్చితార్థం కార్యక్రమం జరగనుంది. కాబోయే భార్య,భర్తలు ఒకే ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకొన్నారు. మొదటి ప్రయత్నంలోనే ఇద్దరూ కానిస్టేబుల్ కొలువులు సాధించారు. అశోక్ తల్లిదండ్రులు నూకరాజు,అప్పలరత్నం, అమ్మాజీ తల్లిదండ్రులు నూకరాజు,చింతల్లి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వివాహం చేస్తామని వారు తెలిపారు.ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం రావడంతో రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.ఇద్దరిని వారి వారి గ్రామాల్లో పలువురు అభినందించారు.

కానిస్టేబుళ్లుగా కాబోయే భార్యాభర్తలు