
దేవరాపల్లిలో ఆర్టీసీ ప్రయాణికుల నిరసన
● కృష్ణారాయుడుపేట వద్ద కల్వర్టును యుద్ధప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్
దేవరాపల్లి: విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణారాయుడుపేట సమీపంలో కూలిన కల్వర్టును యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ఆర్టీసీ ప్రయాణికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన చేపట్టారు. కృష్ణారాయుడుపేట, ఉగ్గినవలస గ్రామాల మధ్య కల్వర్టు కుంగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరాపల్లి నుంచి వయా కొత్తవలస మీదుగా విశాఖపట్నం వెళ్లే మార్గంలో ప్రతి 15 నిముషాలకు 12డీ బస్సులు రాకపోకలు సాగించేవన్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాలుగా ఆర్టీసీ యాజమాన్యం కొన్ని బస్సులను బ్రిడ్జి కూలిన ప్రాంతం నుంచి, మరికొన్ని బస్సులను కె.కోటపాడు మీదుగా విశాఖపట్నానికి తిప్పుతుందన్నారు. దాంతో అటు కొత్తవలస వైపు ఇటు దేవరాపల్లి వైపు రాకపోకలు సాగించే కొత్తవలస, వేపాడు, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిలో కల్వర్టు కూలిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజా సమస్యల పట్ల ఎంత బాధ్యతగా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రయాణికులకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మద్దతు పలికారు. రోజూ రాకపోకలు సాగించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని, వెంటనే కల్వర్టు పునర్నిర్మించి ప్రజలు కష్టాలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.