
క్లీనర్‌పై దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
● ఆర్థిక ఇబ్బందులతో హైవేలో చోరీలు ● పరవాడపాలెంలో పట్టుకున్న పోలీసులు
కశింకోట: మండలంలోని నూతలగుంటపాలెం వద్ద జాతీయ రహదారిపై చోరీ యత్నంలో భాగంగా లారీ క్లీనర్‌ను కత్తితో పొడిచి గాయపర్చి పరారైన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఇంటి సామగ్రి లోడ్‌తో ఒడిశాలోని పూరి వెళుతున్న లారీని గత నెల 31న ఇక్కడి నూతలగుంటపాలెం వద్ద విశ్రాంతి కోసం నిలిపారు. అక్కడ లారీ క్యాబిన్‌లో నిద్రిస్తున్న డ్రైవర్ మహేష్‌కుమార్ జేబులోని నగదు, సెల్‌ఫోన్‌ను సంచార జాతికి చెందిన పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన కేశవ పవర్, రాహుల్ పవర్ చోరీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కేకలు పెట్టడంతో వారు పరారయ్యారు. అదే సమయంలో మరో లారీలో నిద్రిస్తున్న క్లీనర్ శంకర్‌కుమార్ వద్ద నుంచి నగదు చోరీకి ప్రయత్నించగా గట్టిగా అరిచాడు. దాంతో అతని బారి నుంచి తప్పించుకునేందుకు నిందితుడు కేశవ్ తన వద్ద కత్తితో క్లీనర్‌ను వెనుక భాగంలో పొడిచాడు. వెంటనే మరో నిందితుడు రాహుల్‌తో కలిసి పారిపోయారు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో పరవాడపాలెం గ్రామం వద్ద నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వీరిని కోర్టుకు తరలించారు. నిందితులు సంచార జాతికి చెందిన వారు, వీరు గ్రామాల శివారులో గుడారాలు వేసుకొని ఊర్లలో పగటి వేళ తిరిగి ప్లాస్టిక్ కుర్చీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై నిద్రించే డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఇటువంటి దొంగతనాలతో వీరికి సంబంధాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. దొంగల పట్ల జాతీయ రహదారిపై వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై సత్వరమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐలు లక్ష్మణరావు, మనోజ్‌కుమార్, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.