
నూతన విద్యా విధానంలో అప్‌డేట్ కావాలి
● విశాఖ ఒకటో జోన్ ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్
కశింకోట: నూతన విద్యా విధానానికి అనుగుణంగా మారిన సిలబస్, పరీక్షల నిర్వహణ విధానాలపై బాధ్యులైన హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని విశాఖ ఒకటో జోన్ ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకుడు కె. విజయ భాస్కర్ తెలిపారు. స్థానిక సెయింట్ జాన్స్ స్కూలులో శనివారం జెడ్పీ పాఠశాలల హెచ్‌ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, గురుకుల, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిన అంశాలపై ప్రత్యేక అవగాహన పెంచుకోవడం ద్వారా వాటిపై పట్టు సాధించుకోవచ్చన్నారు. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మదింపు విధానాలతో వచ్చిన అసెస్మెంట్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హెచ్‌ఎంలు తప్పనిసరిగా ఒక సబ్జెక్టును పూర్తిగా బోధించాలన్నారు. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా వారి విద్యా స్థాయిలను పరిశీలించాలన్నారు. డీఈవో గిడ్డి అప్పారావునాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉప విద్యా శాఖ అధికారి జొన్నాడ అప్పారావు, పరీక్షల విభాగం సహాయ సంచాలకుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి సిహెచ్. సత్యనారాయణ, సీసీ వై. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

నూతన విద్యా విధానంలో అప్‌డేట్ కావాలి