
బళ్లారి రాఘవ ప్రదర్శనలు అమోఘం
తుమ్మపాల: రచనలు, నాటకాల రూపంలో సామాజిక సమస్యలను సమర్ధంగా ప్రదర్శించి స్పష్టమైన సందేశాన్నిచ్చిన మహానుభావుడు బళ్లారి రాఘవ అని అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు కొనియాడారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు శనివారం ఎస్పీ కార్యాలయంలో బళ్లారి రాఘవ 145వ జయంతి నిర్వహించారు. ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి మాత్రమే కాకుండా, సమాజం మార్పు వైపు దారితీసే శక్తిగా కళను ఉపయోగించిన మహానుభావుడు బళ్లారి రాఘవ అని తెలిపారు. ఆయన రచనలు నేటికీ ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయన్నారు. నేటి సమాజ నిర్మాణంలో కళలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, విలువలతో కూడిన కళా అభిరుచి యువతలో పెంపొందించాలన్నారు. డీటీసీ డీఎస్పీ బి.మోహనరావు, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, లక్ష్మి, గఫూర్, ఎస్సైలు ప్రసాద్, సురేష్‌బాబు, గిరి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.