
సమర్థవంతంగా విద్యాబోధన
శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న డీఈవో అప్పారావు నాయుడు
సబ్బవరం: శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను వినియోగించుకుని సమర్థవంతంగా విద్యాబోధన సాగించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు సూచించారు. సబ్బవరం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన మొదటి విడత ఇన్ సర్వీస్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలుగు బోధన సమయంలో విద్యార్థులను ఆకట్టుకునేలా పాటలు, కథలు మొదలైన ప్రక్రియ ద్వారా బోధన సాగాలన్నారు. విద్యార్థులతో మంచిగా వ్యవహరించాలని, లేకపోతే డ్రాపౌట్ అయ్యే ప్రమాదముందన్నారు. దానికి తానే ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. జీవితాలను మలుపు తిప్పే మంచి ఉపాధ్యాయులను విద్యార్థులు చిరకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రోజెక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.జయప్రకాష్, స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ శేషగిరి, సబ్బవరం ఎంఈవో జె.రవీంద్ర, ఏఎస్‌డీ జమున, ఏఎంవో కెజియో, ఆర్పీలు పాల్గొన్నారు.