
కేంద్రం ఉక్కు పంజా
● స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యం ● తేల్చి చెప్పేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ● కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలు ● స్టీల్‌ప్లాంట్‌పై రాజ్యసభలో ఆరు ప్రశ్నలు వేసిన ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ● వాటికి ఇచ్చిన వివరణలో కేంద్రం వైఖరి వెల్లడి ● సెయిన్‌లో విలీనం చేసే ప్రతిపాదనే లేదని స్పష్టీకరణ ● 1,017 మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం ● మండిపడుతున్న కార్మిక వర్గాలు
విశాఖ సిటీ : స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ గూడు పుఠాణి బట్టబయలైంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం కుండబద్దలు కొట్టింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) నుంచి వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ తథ్యం అని తేల్చేసింది. పెద్దల సభలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేసిన ఆరు ప్రశ్నలకు కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన బూటకపు మాటల బండారం బయటపడింది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారన్న చందంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది. ఒకవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చేసే బాధ్యత తమదని చెబుతూనే.. మరోవైపు ప్లాంట్‌లో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నా చోద్యం చూస్తుండడమే దీనికి నిదర్శనం.
రాజ్యసభలో సుబ్బారెడ్డి ఆరు ప్రశ్నలు
స్టీల్‌ప్లాంట్‌పై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరు ప్రశ్నలు వేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు మూలధన పెట్టుబడి లేదా ఇతరత్రా అవసరాలకు నిధులు విడుదల చేశారా? చేస్తే ఇప్పటి వరకు ఎంత చేశారు? ఆలస్యానికి గల కారణం? పరిశ్రమలో వీఆర్‌ఎస్ స్కీమ్ అమలు చేయడం నిజమేనా? ఎంత మంది దానికి దరఖాస్తు చేసుకున్నారు? పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉందా? ఉంటే ఎందుకు? సెయిల్‌లో విలీనం చేసే అంశం మాటేమిటి? అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విస్తుపోయే సమాధానాలు ఇచ్చారు.
వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు మరోసారి ఉద్వాసన పలికేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వీఆర్‌ఎస్ పేరుతో వేల మంది ఉద్యోగులను బయటకు పంపించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్కీమ్‌ను ఇప్పటికే ప్రవేశపెట్టారు. జూన్ 15వ తేదీ వరకు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తులను స్వీకరించారు. 1,017మంది ఉద్యోగులు దరఖా స్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి తన వివరణలో పేర్కొన్నారు.
ప్రైవేటీకరణపై స్పష్టీకరణ
స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా కేంద్రం వైఖరి మరోసారి స్పష్టమైంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని 2021, జనవరి 27నే కేబినెట్ కమిటీ తీర్మానం చేసినట్లు కేంద్ర మంత్రి తేల్చిచెప్పారు. దీంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వం ప్రజలను మాయలో ఉంచి నాటకాలు ఆడినట్లు ఈ వివరణతో అర్థమవుతోంది. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఏళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అనేకసార్లు వేడుకున్నారు. పవన్ స్వయంగా స్టీల్‌ప్లాంట్ వద్ద సభలోనే పరిశ్రమ ప్రైవేటుపరం కాదంటూ ప్రగల్భాలు పలికారు. కానీ తాజాగా కేంద్రం తన వైఖరిని మరోసారి తేల్చి చెప్పడంతో సీఎం, డిప్యూటీ సీఎం ఇన్నాళ్లు చేసినవి డ్రామాలుగా తేలిపోయింది.
సెయిల్‌లో విలీన ప్రతిపాదనే లేదు
స్టీల్‌ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలని కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దీని కోసం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. కానీ అసలు ఆ ప్రతిపాదనే లేనట్లు కేంద్ర మంత్రి తేల్చేశారు. అలాగే మూలధన వ్యయం కింద కేంద్రం రూ.11,440 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు రూ.9,824 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తుందో? ఆలస్యానికి గల కారణాలను మాత్రం తెలపకపోవడం గమనార్హం.