
నరకకూపాలు.. బీసీ సంక్షేమ హాస్టళ్లు
● ప్రభుత్వం కేటాయించిన రూ.145 కోట్లు తక్షణమే ఖర్చు చేయాలి
● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్
తుమ్మపాల: రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రూ.145 కోట్లతో రానున్న నెల రోజుల్లో బీిసీ సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కల్పించకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నాతోపాటు అవసరమైతే నిరాహారదీక్ష కూడా చేస్తామని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సౌకర్యాలపై మూడు రోజుల పరిశీలన అనంతరం పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ స్టూడెంట్స్ విభాగం నాయకులు శుక్రవారం కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చి వసతి గృహాల దీన స్ధితిగతులపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో హాస్టళ్ల సందర్శనలో అనేక లోపాలు గుర్తించామన్నారు. బాత్‌రూమ్స్ లేక పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నారని, రెండు నెలల క్రితం ఇచ్చిన స్కూల్ బ్యాగులు నాణ్యత లేక చిరిగిపోతున్నాయని, ఇరుకిరుకు గదుల్లో 20 నుంచి 30 మంది పిల్లలను కుక్కడంతో పడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యోగాంధ్ర పేరుతో హాస్టల్ పిల్లల్ని రోడ్లపై పడుకోబెట్టారని, రూ.300 కోట్లు అనవసర ఖర్చు చూపించారని, ఆ నిధులను వసతీ గృహాల అభివృద్ధికి ఖర్చు చేస్తే ఏసీ గదుల్లో పిల్లలకు వసతులు కల్పించవచ్చన్నారు. విద్యావ్యవస్ధను, వసతి గృహాలను నాశనం చేస్తే నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలే దిక్కని ప్రజలు భావిస్తారన్న ధోరణిలో ప్రభుత్వం వ్యహరిస్తోందన్నారు. డీఆర్వో వై.సత్యనారాయణరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గాల అధ్యక్షులు రాయ్ రాజా, అప్పలనాయుడు, కిలాడ శ్రీనివాస్, పెందుర్తి నియోజకవర్గ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు అవగడ్డ శ్రీనివాస్, సోషల్ మీడియా అధ్యక్షుడు శ్రీకాంత్, వివిధ విభాగాల నాయకులు నవీన్, జనపరెడ్డి శ్రీను, మురళి, మణికంఠ, వెలుగుల కిట్లు, శ్యామ్, మడక కార్తీక్, దొడ్డి సాయి పాల్గొన్నారు.