
తొలి విడత రాష్టం అందించేది రూ.5 వేలు
‘అన్నదాత సుఖీభవ’ కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అనకాపల్లి జిల్లాలో 2,31,688 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరి ఖాతాల్లో మొత్తం రూ.162.17 కోట్లు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.115.84 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం నుంచి రూ.46.33 కోట్లు విడుదల చేస్తారు. పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ.6 వేలు అందిస్తారు. అన్నదాత సుఖీభవ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలను మూడు విడతలుగా చెల్లిస్తుంది. మొదటి విడతలో రూ.5,000, రెండో విడతలో రూ.5,000, మూడో విడతలో రూ.4,000 చొప్పున విడుదల చేయనుంది. జిల్లాలో పెట్టుబడి సాయానికి అర్హత పొందిన రైతుల్లో ఈకేవైసీ పూర్తయిన వారు 2,37,057 మంది ఉన్నారు. మిగతా రైతులకు ఈకేవైసీ పూర్తి కావాల్సి ఉంది.
అర్హత ఉన్న ప్రతి రైతుకు
‘సుఖీభవ’ అందాల్సిందే..
గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతుల కన్నా ఎక్కువగా ఈ ఏడాది లబ్ధి పొందాల్సి ఉంటుంది. కానీ 34 వేల మందికి పైగా రైతులకు కోత విధించారు. ఏ ప్రాతిపదికన కోత విధించారో వ్యవసాయ అధికారులు చెప్పాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నామమాత్రంగా అమలు చేస్తే సరిపోదు. గతేడాది పెట్టుబడి సాయం ఇస్తారనే ఆశతో అప్పులు చేసి వ్యవసాయం చేసి రైతు నష్టపోయాడు. రెండో ఏడాది కూడా అప్పు చేసిన 34 వేల మంది రైతులను ఆదుకునేది ఎవరు? అర్హత ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ ఇవ్వాల్సిందే.
– వెంకన్న, రైతు సంఘం నాయకుడు
●