
రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
● రీసర్వే పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలి ● సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ గోవిందరావు
తుమ్మపాల: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ ఆర్.గోవిందరావు సూచించారు. కలెక్టరేట్‌లో జేసీ ఎం.జాహ్నవితో కలిసి అందరికీ ఇళ్లు, రీసర్వే, ఆక్రమిత భూ ముల క్రమబద్ధీకరణ, పీజీఆర్‌ఎస్, ఎస్సీ బరియల్ గ్రౌండ్స్, కుల ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వేను వేగవంతం చేసేందుకు గ్రామ సర్వేయర్లు, వీఆర్‌వోలు, మండల సర్వేయర్లు, డిప్యూ టీ తహసీల్దార్లు మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. రీసర్వే ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు భూము ల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 2027 డిసెంబరు నాటికి భూముల రీసర్వే ప్రక్రియ పూర్తి కావాలన్న లక్ష్యంతో అందరూ పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
● జిల్లాలో ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని గోవిందరావు సూచించారు. తహసీల్దార్లు తప్పకుండా లేఅవుట్లను పరిశీలించాలన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇంటి నిర్మాణం చేపట్టకపోతే వారికి 3 సెంట్లు మంజూరు చేయాలని కోరారు. వివాదాలు లేని ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై ప్రజల్లో అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలన్నారు. ఆక్రమిత ప్రభుత్వ భూమిలో ఇల్లు తప్పక నిర్మించి ఉండాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం అందరికీ మంజూరు చేయాలని చెప్పారు. భూహక్కు పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పాతది తీసుకొని కొత్తది అందించాలని సూచించారు. ఎస్సీ బరియల్ గ్రౌండ్స్ కోసం స్థలాలు పరిశీలించి మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని రెవెన్యూ వ్యవస్థ, ప్రజలకు అందిస్తున్న సేవలు, పలు అంశాలపై జేసీ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వై.సత్యనారాయణ, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఆర్డీవో ఆయిషా, సర్వే విభాగం ఏడీ గోపాలరాజా, ల్యాండ్స్ సెక్షన్ సూపరింటెండెంట్ రత్నం, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ వాసునాయుడు, కలెక్టరేట్ ఏవో విజయకుమార్, మండల తహసీల్దార్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.