
అధిక ఫీజుల వసూళ్లపై డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆందోళన
యలమంచిలి రూరల్: అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ, డిగ్రీ కళాశాల, స్థానిక తహసీల్దార్ కళాశాల ఎదుట బైటాయించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించాలని కోరారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మద్దతుగా నిలిచారు. యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం బీఎస్సీ విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.14,040, బీఏ, బీకాం విద్యార్థుల నుంచి రూ.13,840 వసూలు చేస్తున్నారని, గతేడాది కంటే ఫీజులు పెంచారని, అదనంగా ట్యూషన్, యూనివర్సిటీ ఫీజులు వంటివి తమ వద్ద నుంచి వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల గురించి తాము గానీ, తమ తల్లిదండ్రులు గానీ అడిగితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారని, కొన్నిసార్లు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు విలేకరుల ఎదుట ఆరోపణలు చేశారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇచ్చారన్నారు. పెంచిన ఫీజుల భారం మోయలేకపోతున్నామన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ మాట్లాడుతూ ఇప్పటి వరకు విద్యార్థుల వద్ద వసూలు చేస్తున్న అన్ని రకాల ఫీజులు, ఖర్చులపై ఉన్నతాధికారులు విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. ప్రభుత్వం ఫీజులు పెంచడం, రీయింబర్స్ చేయకపోవడంతో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ వరహాలుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కృపానంద, లక్ష్మణ, కవిత, రమ్య, మహేష్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.