
‘స్పీకర్ కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు’
నర్సీపట్నం: నర్సీపట్నం బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలంలో అక్రమ నిర్మాణాలు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన గురవయ్య యాదవ్ ఆరోపించారు. బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బొట్టా నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు బొంతు రమణతో కలిసి ఆయన గురువారం అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చేతిలో మరణించిన బ్రిటిష్ అధికారుల మృతదేహాలను ఖననం చేసి సమాధులు నిర్మించారన్నారు. అల్లూరి పోరాట పటిమకు స్ఫూర్తిగా ఉన్న సమాధులను పరిరక్షించకుండా నాయకులు, అధికారులు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో భూదందా, ఇసుక, మైనింగ్ మాఫీయ దందాలు పెచ్చుమీరాయన్నారు. కోర్టు ఆర్డర్ ఉందని మున్సిపల్ కమిషనర్ నోటితో చెప్పడం కాదని, చూపించాలని డిమాండ్ చేశారు. నాయకుల అండదండలతో నిర్మాణాలను ఆగమేఘాలపై నిర్మిస్తున్నారన్నారు. నిర్మాణాలను నిలువరించాల్సిన కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.