
‘పెన్షనర్ల సమస్యలు పట్టని ప్రభుత్వం’
యలమంచిలి రూరల్: పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, నాలుగు డీఏల బకాయిలు ఊసెత్తడం లేదని పెన్షనర్ల సంఘం నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని కోర్టు కూడలి వద్ద ఎన్‌జీవో హోంలో గురువారం సాయంత్రం యలమంచిలి తాలూక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి సోమేశ్వర్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వి.జగన్నాథరావు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లపై చిన్నచూపు చూస్తోందని, ఒకటో తేదీకి పెన్షన్ సొమ్ము ఖాతాల్లో జమ అయితే చాలన్నట్టుగా పరిస్థితి ఉందని సోమేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల బకాయిల్లో కనీసం ఒకటైనా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కోరుమిల్లి సుబ్బారావు, ఎస్.అప్పారావు, జి.కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కె.సత్యారావు, జి.సాంబమూర్తి, పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు.