
దళితుడిపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
ఎస్.రాయవరం: హోంమంత్రి అనిత ఇలాకాలో ఓ దళితుడిపై గోకులపాడుకు చెందిన టీడీపీ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దండోరా వేస్తుంటే తన డప్పు లాక్కున్నాడని బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోకులపాడు, గెడ్డపాలెం, తిమ్మాపురం గ్రామాలకు సాగునీటి కోసం జమ్మి, గ్రోయిన్ కాలువల్లో శ్రమదానం చేయడానికి రైతులు రావాలని దండోరా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గోకులపాడు గ్రామానికి చెందిన రైతు పెనుగొల్లుకు చెందిన దండోరా వేసే చిందాడ దాసును తీసుకువెళ్లాడు. ముందుగా గెడ్డపాలెం, తిమ్మాపురం గ్రామాల్లో గురువారం దండోరా వేసిన దాసు.. గోకులపాడు గ్రామానికి రైతు నాగేశ్వరరావుతో చేరుకున్నాడు. అది గమనించిన టీడీపీ నాయకుడు సమ్మెంగి నానాజీ దండో ఎందుకు వేస్తున్నావు, ఈ గ్రామానికి ఎందుకు వచ్చావని ప్రశ్నించి బూతులు తిట్టి, డప్పు లాక్కున్నాడని బాధితుడు ఆరోపించాడు. ఈమేరకు దాసు ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.