
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి
చోడవరం: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పీడీఎస్‌ఓ) ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఆందోళన చేశారు. చోడవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి మెయిన్‌రోడ్డుపై వినాయకుడి గుడి మీదుగా కొత్తూరు జంక్షన్ వరకూ నిరసన ర్యాలీ చేశారు. అక్కడ విద్యార్ధులంతా మానవహారం చేశారు. అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు నందారపు భాస్కరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీలకు ఫీజుల కట్టలేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు ఇవ్వక ఉన్నత చదువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. 117 జీఓను రద్దుచేస్తామని చెప్పిన విద్యాశాఖామంత్రి లోకేష్ ఇప్పటి వరకూ ఈ జీఓను రద్దుచేయలేదని వెంటనే రద్దుచేయాలని భాస్కరరావు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు బి.కుమార్, గణేష్, మనోజ్, వై.రాజు, రామకృష్ణ, వరహాలనాయుడు పాల్గొన్నారు.