
జ్వరాలపై అప్రమత్తం
డీఎంహెచ్‌వో హైమావతి
నాతవరం: జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హైమవతి ఆదేశించారు. గునుపూడి పీహెచ్‌సీని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి, పీహెచ్‌సీ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్యం కోసం పీహెచ్‌సీకి వచ్చే రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, సకాలంలో వైద్యసేవలందించడమే ధ్యేయంగా అంకితభావంతో పనిచేయాలని వైద్యాధికారులు చంద్రశేఖర్, అనూష్, సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో జ్వరాల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పి.జగ్గంపేటలో జ్వరాలు ప్రబలినట్టు ఫిర్యాదులు రావడంతో ఆమె స్వయంగా ఆ గ్రామంలో పర్యటించి, పరిశీలించారు. అనంతరం నాతవరం పీహెచ్‌సీ పరిధి సరుగుడు పంచాయతీలో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. గ్రామంలో జ్వరాలు ప్రబలితే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ఇప్పటికే జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈకార్యక్రమంలో నాతవరం పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసన్న, వైద్య సిబ్బంది కె.వెంకటరమణ, పెలుపర్తి బైరాగి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.