
అప్పన్న సన్నిధిలో..
సింహగిరిపై వసతి కోసం భక్తులు తిప్పలు పడాల్సి వస్తుంది. సుదూర ప్రాంతాల
నుంచి వచ్చిన భక్తులు కొండపై కనీసం ఒక్క రోజైనా బస చేసి, ఆధ్యాత్మిక సంతృప్తి
పొందుదామంటే అందుకు వీల్లేని దుస్థితి. ఇక్కడ సామాన్య భక్తులకు అందుబాటు ధరలో ఉన్నది దేవస్థానానికి చెందిన గజపతి సత్రం మాత్రమే. అది కూడా వారాంతపు రోజులు, పర్వదినాలు, పెళ్లిళ్ల సమయంలో దొరకని పరిస్థితి. దీంతో ప్రైవేట్ హోటళ్లు, లాడ్జీల్లో బస చేసి, చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు.
● అందుబాటులో ఉన్నది గజపతి సత్రం ఒక్కటే
● పెళ్లిళ్లు, ఉత్సవాలు, యాత్రా దినాల్లో గజపతి సత్రం ఫుల్
● వీఐపీలకూ దొరకని వీఐపీ కాటేజీలు
● మరుగున పడ్డ డొనార్స్ కాటేజీ ప్రణాళిక
సింహాచలం: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి సింహగిరి పైనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం. స్వామి దర్శనానికి రోజూ వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వీరిలో కుటుంబ సమేతంగా వచ్చే దూర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ. సింహగిరికి చేరుకున్నాక తాత్కాలిక బసకు గదులు దొరకడం గగనమైపోయింది. దీనికి కారణం సరిపడా కాటేజీలు సింహగిరిపై లేకపోవడమే..! సింహగిరిపై భక్తులకు సరిపడా వసతి కల్పించాలని ఇటీవల ఆలయానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి కూడా పలువురు తీసుకెళ్లారు.
గజపతి సత్రం ఒక్కటే దిక్కు
సింహగిరిపై ప్రస్తుతం గజపతిసత్రం ఒక్కటే భక్తుల వసతికి అందుబాటులో ఉంది. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ సత్రంలో 24 ఏసీ, 24 నాన్ ఏసీ గదులున్నాయి. జీఎస్టీతో కలిపి ఏసీ అయితే రూ.1,008, నాన్ ఏసీ అయితే రూ.560 చెల్లించాలి. శని, ఆదివారాలు, యాత్రా రోజులు, పెళ్లిళ్ల సీజన్లలో ముందుగా బుక్ చేసుకునేవి ఈ గదులే. దీంతో సామాన్య భక్తులకు గదులు లభించడం కష్టతరమవుతోంది. గంటల తరబడి నిరీక్షించినా ఫలితంలేక నిరాశగా వెనుదిరగాల్సి వస్తోందని భక్తులు తరచూ వాపోతున్నారు.
వీఐపీ కాటేజీల పరిస్థితీ అంతే..
సింహగిరిపై ఉన్న వీఐపీ కాటేజీల పరిస్థితి కూడా దాదాపు అంతే. ప్రస్తుతం వీఐపీ కేటగిరీకి చెందిన ప్రహ్లాద, సింహవల్లీ, రమణారెడ్డి, అన్నపూర్ణ, వీబీసీ కాటేజీలు సింహగిరిపై ఉన్నాయి. ప్రహ్లాద కాటేజీలో మూడు సూట్ రూమ్‌లకు కలిపి అద్దె రూ.3,920. సింహవల్లీ, రమణారెడ్డి కాటేజీల్లో రెండేసి సూట్లు ఉండగా, ఒక్కో సూట్‌కు రూ.1120, అన్నపూర్ణ, వీబీసీలో రెండేసి సూట్‌లుండగా ఒక్కో సూట్‌కు రూ.2,800 చెల్లించాలి. కొంచెం ఆర్థిక స్థోమత కలిగిన వారు ఆ కాటేజీల్లో బస చేద్దామంటే సవాలక్ష నిబంధనలు సతాయిస్తాయి. ఆ సమయానికి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, ఉన్నతాధికారుల బస చేయకపోతే, వారి సిఫార్సుతో మరెవరూ లేకపోతే తప్ప ఆ కాటేజీలు లభించవు.
మరుగున పడ్డ డోనార్స్ కాటేజీ ప్రణాళిక
సింహగిరిపై సాధారణ భక్తులకు, వీఐపీలకు అందుబాటులో ఉండేలా డోనార్స్ కాటేజీ నిర్మాణానికి 2008లో ప్రణాళిక చేశారు. మైక్రోటవర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న కొండపై వీఐపీ కాటేజీల నిర్మాణానికి అప్పటి ఈవో, ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సంకల్పించారు. డోనార్స్ కాటేజీ నిర్మాణానికి కొండపై కొంతమేర స్థలాన్ని చదును చేశారు. రామచంద్రమోహన్ బంధువే తొలి విరాళాన్ని అందించారు. ఒక్కో డోనార్‌కు ఒక్కో గది పేరు పెట్టి ఏడాదిలో నెల రోజులు వారికి ఉచితంగా ఆ గదిని ఇచ్చేందుకు నిర్ణయించారు. కానీ కొన్ని రోజులకే ఆ ప్రణాళిక మరుగున పడింది.
వసతి సౌకర్యం పెంచాలి
ఉత్తరాంధ్రలో ఎంతో పెద్ద క్షేత్రం అయిన సింహాచలానికి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం పెంచాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంది. ముఖ్యంగా కనీసం ఒకరోజైనా ఇక్కడ ఉండేలా వసతి సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి.
– రవితేజ, పార్వతీపురం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గజపతి సత్రం
ఉత్సవ రోజుల్లో బుకింగ్ బంద్
సింహగిరిపై జరిగే చందనోత్సవం, వార్షిక కల్యాణోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి తదితర ప్రముఖ ఉత్సవాల రోజుల్లోనైతే భక్తులు బస కోసం ఆశలు వదులుకోవాల్సిందే. ఆయా రోజుల్లో దేవస్థానమే ముందుగా గజపతిసత్రంలోని గదులను అద్దెకు కేటాయించే ప్రక్రియని నిలిపేస్తుంది. ఆ రోజుల్లో విధులకు హాజరయ్యే పలు ప్రభుత్వ సంస్థల సిబ్బందికి, ఇతరత్రా అవసరాలకు ఆ గదులను కేటాయిస్తుంది.

అప్పన్న సన్నిధిలో..

అప్పన్న సన్నిధిలో..

అప్పన్న సన్నిధిలో..