
అయ్యన్న తీరు అనుమానాస్పదం
● రాజ్యాంగ హోదాను ఆపహాస్యం చేస్తున్నారు ● స్పీకర్ రోడ్డెక్కి లారీలు అపడమేంటి ? ● అన్ని కంపెనీల విషయంలోనూ ఇలాగే స్పందిస్తారా ● ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం: రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు ఆ పదవి హుందాతనాన్ని దిగజార్చుతున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శాసన సభ్యుడిగా గెలిచి, స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు రోడ్డెక్కి లారీలు ఆపడం ఏంటని ప్రశ్నించారు. పట్టుకున్న ఓవర్‌లోడు లారీలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించకుండా..ఓనర్లు తన వద్దకు వచ్చే వరకు వదలొద్దంటూ పోలీసులను హెచ్చరించడం మరీ హాస్యాస్పదంగా ఉందన్నారు. పొట్ట కూటి కోసం పని చేస్తున్న లారీ డ్రైవర్లు, క్లీనర్ల పట్ల స్పీకర్ నోరు పారేసుకోవడం ఆయన స్థాయికి తగదన్నారు. మాకవరపాలెం మండలంలో ఉన్న పయనీరు అల్యూమినియం కంపెనీని లక్ష్యంగా చేసుకుని ఆ కంపెనీకి ముడి సరుకు రవాణా చేస్తున్న లారీలను ఆపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నది స్పీకర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అల్యూమినియం కంపెనీకి ముడి సరుకు రవాణా చేస్తున్న లారీలను లక్ష్యంగా చేసుకుని అధిక లోడు పేరుతో ఆయన తరచూ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు, వంతెనలు దెబ్బతినకుండా ఉండాలంటే అధిక లోడ్‌తో వెళ్లే అన్ని వాహనాలను ఆపితే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచ్చల విడిగా ఎక్కడపడితే అక్కడ మైనింగ్ జరుగుతోందని, క్వారీల నుంచి టిప్పర్లతో టన్నుల కొద్దీ రాయిని ఇదే రోడ్డులో తరలిస్తున్నారని చెప్పారు. స్పీకర్‌కు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. కేవలం అల్యూమినియం కంపెనీకి వెళ్తున్న లారీలను లక్ష్యంగా చేసుకుని ఆపడమనేది పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. రాత్రీపగలు అన్న తేడాలేకుండా నర్సీపట్నం మీదగా రాంబిల్లిలోని నేవల్ బేస్‌కు రాకపోకలు సాగిస్తున్న అధిక లోడు లారీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నర్సీపట్నం మీదగా నిత్యం రాకపోకలు సాగిస్తున్న లారీలను స్పీకర్ ఎందుకు ఆపడం లేదన్నారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరిచే విధంగా అయ్యన్నపాత్రుడు వ్యవహరించడం రాజ్యాంగ హోదాను అపహాస్యం చేయడమేనని మాజీ ఎమ్మెల్యే గణేష్ తెలిపారు.