
రోడ్డు కోసం యూకలిప్టస్ తోట ధ్వంసం
● పరిహారం చెల్లించాలని అడ్డుకున్న పీతపాలెం రైతులు ● చేసేది లేక వెనుదిరిగిన తహసీల్దార్, పోలీసులు
తుమ్మపాల: పరిహారం చెల్లించకుండా సాగులో ఉన్న యూకలిప్టస్ తోటను పోలీసు బందోబస్తు నడుము ధ్వంసం చేయడాన్ని రైతులు అడ్డుకున్నారు. మండలంలో కోడూరు సర్వే నంబర్ 1/1 ప్రభుత్వ భూమిలో సబ్బవరం మండలం పీతపాలెం గ్రామానికి చెందిన రైతులు పూర్వం నుంచి సాగులో ఉన్నారు. సమీపంలో కలెక్టర్ బంగ్లాతో పాటు ఉన్న ఆటోనగర్, ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు పీతపాలెం, పైడివానిపాలెం మీదుగా అసకపల్లి వద్ద జాతీయ రహదారికి 100 అడుగుల రోడ్డు అభివృద్ధి చేయాల్సి ఉంది. పీతపాలెం వద్ద కోడూరు రెవెన్యూ పరిధిలో రైతుల సాగులో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమి మధ్యలోంచి సుమారు 1.54 ఎకరాల్లో 100 అడుగుల వెడల్పున రోడ్డుకు ఏపీఐఐసీ కేటాయింపులు చేసింది. ఈ మేరకు మొదలుపెట్టిన పనులను కొద్ది రోజులుగా రైతులు అడ్డుకున్నారు. అయితే బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఎం.భాస్కర అప్పారావు, రెవెన్యూ సిబ్బంది రూరల్ పోలీసులు బందోబస్తు నడుమ బుల్డోజర్లు, పొక్లెయిన్లతో తోటను ధ్వంసం చేశారు. అనంతరం చదును చేసే పనులకు పూనుకున్నారు. రైతులు స్థానిక నాయకులతో కలిసి పనులను ఆపేశారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేపడితే సహించమని రైతులు తేల్చి చెప్పడంతో పనులు నిలిపివేసి అధికారులు వెనుతిరిగారు.

రోడ్డు కోసం యూకలిప్టస్ తోట ధ్వంసం