
బల్క్ డ్రగ్ పార్క్‌పై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటా
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో నిర్మించతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్‌పై ప్రజాభిప్రాయ సేకరణ రద్దుచేయాలని మత్స్యకారులు, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయణ సేకరణ నిర్వహిస్తే అడ్డుకుంటామని చెప్పారు. బల్క్ డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం రాజయ్యపేటలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, ఎం.అప్పలరాజు , వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎరిపల్లి నాగేశు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన ఈ బల్క్ డ్రగ్‌పార్క్‌ను ప్రజలు, మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. వచ్చే నెల ఆరోతేదీన నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలంటూ నినాదాలు చేశారు. కూటమిప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కంపెనీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని చెబుతూ రైతులనుంచి వేలాది ఎకరాలు లాక్కొంటున్నారన్నారు. కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెలిపారు. స్కిల్‌డవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని హోంమంత్రి అనిత చెబుతున్నారని, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు పునాది రాయికూడా వేయలేదని తెలిపారు. బల్క్‌డ్రగ్‌పార్క్ కోసం ఇప్పటికే రెండు వేల ఎకరాలు కేటాయించారని, అదనంగా మరో ఎనిమిది వందల ఎకరాలు కేటాయించేందుకు భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రైతులకు తెలియకుండా 6ఏ నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రజాభిప్రాయసేకరణను అడ్డుకుని తీరుతామన్నారు.ఈ ఆందోళనలో మనబాల రాజేష్, కోదండరావు తదితరులు పాల్గొన్నారు.