
24 కిలోల గంజాయి పట్టివేత
నక్కపల్లి: మండలంలో సారిపల్లిపాలెం సమీపంలో మంగళవారం పోలీసులు 24 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నర్సీపట్నం డీఎస్‌పీ శ్రీనివాసరావు ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఎస్‌ఐ సన్నిబాబు సారిపల్లిపాలెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనకాపల్లి నుంచి తుని వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనంఫై రెండు కాలేజీ బ్యాగులను పట్టుకుని వ్యక్తి రావడాన్ని గుర్తించారు. తనిఖీ చేయగా.. ఆయన వద్ద 24 కేజీల గంజాయి బయట పడిందని డీఎస్‌పీ తెలిపారు. చింతపల్లి మండలం మామిడిపాలెం గ్రామానికి చెందిన సుక్రి అర్జున్, ఇతని స్నేహితుడు రోలుగుంట మండలం పెద్దపేట గ్రామానికి చెందిన కొదమ నాగరాజుతో కలసి గంజాయి వ్యాపారం చేస్తున్నారన్నారు. వీరికి గొలుగొండ మండలం కోడులపాలెం గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి రెడ్డి నర్సింహమూర్తితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. నర్సింహమూర్తికి అర్జున్ గతంలో ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయించేవాడన్నారు. తాజాగా నర్సింహమూర్తి ఈయనకు ఫోన్‌చేసి గంజాయి కావాలని, తుని హైవే రోడ్డులో అప్పగించాలని కోరడంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన 24 కిలోల గంజాయిని 12 ప్యాకేట్లలో సిద్ధం చేసి తునిలో అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో అర్జున్ అంగీకరించాడన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై విచారణ జరుగుతోందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, గంజాయి, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అర్జున్‌పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ ఏడాది నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సారిపల్లిపాలెం వద్ద పట్టుబడిన 840 కిలోల గంజాయి రవాణాకు సంబంధించి కేసులో అర్జున్ ప్రధాన నిందితుడని చెప్పారు. ఈ సమావేశంలో సీఐ కుమార స్వామి, ఎస్‌ఐ సన్నిబాబు, తదితరులు పాల్గొన్నారు.