
జ్వరాలతో మరణిస్తున్నా పట్టించుకోరా..!
● గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి ● నాతవరం పీహెచ్‌సీలో రెగ్యులర్ వైద్యులను నియమించాలి ● సీపీఐ మండల కార్యదర్శి చిన్నయ్యనాయుడు
నాతవరం: గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతూ మరణిస్తున్నా కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని మండల సీపీఐ కార్యదర్శి అంకంరెడ్డి చిన్నయ్యనాయుడు అన్నారు. ఆయన మండలంలో మంగళవారం పి.జగ్గంపేట, కొండధర్మవరం పి.కె.గూడెం, గునుపూడి నాతవరం గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో జ్వరాలు నియంత్రించాలంటే స్పీకరు అయ్యన్నపాత్రుడు దృష్టి సారించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మూడు నెలలుగా మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జ్వరాలతో ప్రజలు బాధలు పడుతున్నారన్నారు. ఇటీవల పి.జగ్గంపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు జ్వరాలతో బాధపడుతూ మరణించారన్నారు. మరో ముగ్గురు పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. మండలం అంతా జ్వరాలతో అల్లాడిపోతుంటే నాతవరం పీహెచ్‌సీలో వైద్యులు లేరన్నారు. గతంలో ఇక్కడ పనిచేసే ఇద్దరు వైద్యులు వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోయారన్నారు. పీహెచ్‌సీలో రెగ్యులర్ వైద్యులను నియమించి గ్రామాల్లో యుద్ధప్రతిపదికన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో పరిస్థితులపై మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆందోళన చేస్తామన్నారు.