
మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్త పెను సమస్య
● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర
బీచ్‌రోడ్డు(విశాఖ): మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారుతోందని, ఇది చాలా విచారకరమని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె. సుభద్ర అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ అవేర్‌నెస్ ఫోరం, ఏటీఎస్‌ఏసీ ఇండియా సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ స్వచ్ఛంధ సంస్థ, ఆంధ్రప్రదేశ్ సీఐడీ, పలు సంస్థల సమన్వయంతో రూపొందించిన ‘మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరం – ఈ దోపిడీని అంతం చేయండి’ పోస్టర్‌ను మంగళవారం సిరిపురంలోని జెడ్పీ చైర్మన్ క్యాంప్ ఆఫీసులో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా అక్రమ రవాణాలో పిల్లలు, మహిళలు, పేదవారు, నిరక్షరాస్యులు బాధితులుగా మారుతుండటం బాధాకరమన్నారు. చక్కని జీవితం, ఉద్యోగం, పెళ్లి పేరుతో నమ్మించి..వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ రైట్స్ అవేర్‌నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాతో పాటు బాలికల అక్రమ రవాణా వ్యవస్థను రూపుమాపేందుకు తమ ఫోరం ప్రభుత్వంలోని వివిధ శాఖలతో పాటు ఈ అంశంపై పోరాటాలు చేస్తున్న రాష్ట్రంలోని 16 ప్రభుత్వేతర (ఎన్‌జీఓ) సంస్థలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ అవేర్‌నెస్ ఫోరం ప్రతినిధులు కె. ఎల్లయ్య, బి. లవకుశ, ఎం. ప్రవీణా త్రినాథ్, బి. లక్ష్మణరావు, బొడ్డేపల్లి సురేష్, ఎం. హరీష్ కుమార్ పాల్గొన్నారు.