
గోతుల రోడ్లు కనిపించడం లేదా?
● వాటిపై తిరగండి ప్రజల కష్టాలు తెలుస్తాయి ● పారిశుధ్యం మెరుగుపర్చకపోతే చర్యలు తప్పవు ● ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులపై కలెక్టర్ విజయ కృష్ణన్ ఆగ్రహం ● వడ్డాది, ముకుందపురం గ్రామాల్లో సుడిగాలి పర్యటన
బుచ్చెయ్యపేట/మాడుగుల రూరల్: ‘గోతుల రోడ్లు మీకు కనిపించడం లేదా? రెండు రోజులు వాటిపై తిరగండి ప్రజల కష్టాలు తెలుస్తాయి’ అంటూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఆర్‌అండ్‌బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె బుచ్చెయ్యపేట, మాడుగుల మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో పారిశుధ్య పనులు పరిశీలించి అనంతరం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజలు రోడ్డెక్కి రహదారి బాగు చేయాలని గోల చేస్తున్నారు, నిధులున్నా ఎందుకు పనులు చేయడం లేదని ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, డీఈ విద్యాసాగర్, సబ్ కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వడ్డాదిలో పారశుధ్య పనులు సక్రమంగా చేయకపోవడంపై ఎంపీడీవో భానోజీరావు, మండల పంచాయతీ అధికారి విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ ఈశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల వివరాలు సచివాలయ సిబ్బందిని అడగ్గా నీళ్లు నమిలారు. డేటా లేకుండా సమావేశానికి ఎందుకొచ్చారని, ప్రజల పనులంటే చులకనగా ఉందా అంటూ మండిపడ్డారు. వారం రోజుల్లో మరలా వస్తాను, సంక్రమంగా విధులు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వడ్డాదిలో తాగు నీటిపైన, విశాఖ డెయిరీ పాలకేంద్రం వద్ద కలుషిత నీరు వదిలేయడంపైన, డ్రైనేజీలు సరిగా తీయకపోవడంపైన, నకిలీ విత్తనాలు అమ్మకంపై స్థానికులు దొండా నారాయణమూర్తి, బొబ్బాది రాజు, దొండా రమేష్, కోరుకొండ రమణ, సోమేష్ తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత అధికారులకు సూచించి పనులు పరిశీలించాలని ఆదేశించారు.
వారం రోజుల్లో మళ్లీ వస్తా...
మాడుగుల మండలం ముకుందపురంలో ఐదు రోజుల్లో పారిశుధ్యం మెరుగుపర్చకపోతే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆమె అధికారులతో కలిసి ఇక్కడ పారిశుధ్య పనులు పరిశీలించారు. వారం రోజుల్లో మరలా గ్రామాన్ని సందర్శిస్తానని పారిశుధ్యం మెరుగుపర్చకపోతే కార్యదర్శి, ఇతర సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక మహిళలుతో మాట్లాడారు. డ్రైనేజీల్లో చెత్తా చెదరాలు వేయొద్దని, పరిసరాలు పరిశుభ్రతతో రోగాలు దరి చేరవని సూచించారు.
భూ సమస్య గురించి సర్పంచ్ కర్రి గణేష్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీపీవో ఇ. సందీప్, డీపీఆర్సీ జిల్లా సమన్వయకర్త ఇ. నాగలక్ష్మి, ఉపాధి హామీ పథకం ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో అప్పారావు, తహసీల్దార్లు లక్ష్మి, రమాదేవి, ఏపీవో వరహాలబాబు, ఏవోలు భాస్కరరావు, ఎం. అనసూయ, ఎంపీటీసీ సభ్యురాలు దండి నాగరత్నం, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

గోతుల రోడ్లు కనిపించడం లేదా?