
హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తులపై ఫిర్యాదు
తాతయ్యబాబుపై పల్లాకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే రాజు వర్గ సభ్యులు
బుచ్చెయ్యపేట:
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుపై చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు వర్గీయులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తాతయ్యబాబు, ఎమ్మెల్యే రాజు మధ్యన గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే బుచ్చెయ్యపేట మండలంలో ఆ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరు నిర్వహించే కార్యక్రమాల్లో మరొకరు పాల్గొనడం లేదు. ఇదే విషయమై తాతయ్యబాబు గుర్రుగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడిగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే రాజు తీరుపై బాహాటంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజు గ్రూపు రాజకీయాలు చేస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరోకి ఫిర్యాదు వెళ్లింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న రాజకీయ వైరం వల్ల తాజాగా మండలంలో వడ్డాది, బుచ్చెయ్యపేట, తురకలపూడి, విజయరామరాజుపేట, పొట్టిదొరపాలెం, బంగారుమెట్ట ఆరు కోఆపరేటివ్ సొసైటీల పర్సన్ ఇన్‌చార్జుల నియామకాలు నిలిచిపోయాయి. దీనిపై ఎమ్మెల్యే రాజు వర్గానికి చెందిన కొంతమంది నాయకులు మంగళవారం గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిశారు. తాతయ్యబాబే గ్రూపు రాజకీయాలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.