
అవే అర్జీలు.. పరిష్కారం శూన్యం
● సమస్యలు పరిష్కరించాలని పదే పదే ఫిర్యాదులు ● వాటిని పరిష్కరించకుండానే పొంతన లేని సమాధానం ● అధికారుల తీరుపై అర్జీదారుల అసహనం ● పీజీఆర్‌ఎస్‌కు ఆలస్యంగా వచ్చిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్) కార్యక్రమంపై పలువురు అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పీజీఆర్‌ఎస్ అని ఒక్క పనీ పూర్తయింది లేదని వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు ఆలస్యంగా రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. పలువురు అర్జీదారులు అర్జీ నమోదు చేసుకోకుండానే కలెక్టర్‌ను కలవడంతో సిబ్బంది తీరును హెచ్చరించారు. ఈ వారం మొత్తం 297 అర్జీలు నమోదయ్యాయి. రెవెన్యూ విభాగం వినతులతోపాటు తల్లికి వందనంపై ఫిర్యాదులు అందాయి.
భూ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు
చేయాలని నిరసన
భూ సమస్య పరిష్కరించాలంటూ ఇప్పటికి 50 సార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేశానని, ప్రతి వారం కలెక్టరేట్‌కు వచ్చి విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, పొంతన లేని సమాధానాలతో చేతులు దులుపుకుంటున్నారని నక్కపల్లికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, రైల్వే బోర్డు మెంబర్ కొలనాటి అప్పారావు అసహనం వ్యక్తం చేశారు. తన పేరున ప్రభుత్వం ఇచ్చిన నాలుగెకరాల డీ పట్టాను ఇతరుల పేరున ఆన్‌లైన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు లేవని నక్కపల్లి మండలం ఉపమాక గ్రామానికి చెందిన కురందాసు నాగరాజు నిరాశ వ్యక్తం చేశాడు. రూ.15 వేల పింఛన్ కోసం చిన్నపాటి తప్పులు సాకుగా చూపి కలెక్టరేట్ చుట్టూ తిప్పించుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని 90 శాతం దివ్యాంగుడైన పొట్ల తులసిరామ్, అతని తండ్రి అప్పారావు వాపోయారు.

అవే అర్జీలు.. పరిష్కారం శూన్యం