
భూ తగాదాలపై ఎస్పీ విభాగానికి అర్జీల వెల్లువ
అర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 45 అర్జీలు వచ్చాయి. వీటిలో 35 వరకు భూ తగాదాలపై రావడం విశేషం. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలకు వేగంగా న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజా సమస్యలపై శ్రద్ధ చూపిస్తూ, న్యాయపరంగా పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ వారం వచ్చిన అర్జీల్లో భూ తగాదాలు–35, కుటుంబ కలహాలు–5, మోసాలకు సంబంధించిన ఫిర్యాదు–1, ఇతర విభాగాలకు చెందినవి–4 అర్జీలు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌ఐ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.