
స్పీకర్ జోక్యం చేసుకోవాలని డప్పులతో నిరసన
● క్వారీ అనుమతులు రద్దు చేయాలని నిరసనకారుల డిమాండ్
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జి.కోడూరు నల్లరాయి క్వారీ అనుమతులు రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ క్వారీ బాధితులు చేపట్టిన దీక్షలకు సోమవారం సీపీఎం నాయకులు మద్దతు పలికారు. వినూత్న రీతిలో వంటా వార్పుతోపాటు డప్పులు వాయిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల భూముల్లో క్వారీని వెంటనే రద్దు చేయాలన్నారు. బాధితులు వారం రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నా, ఆర్డీవో కానీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్నారు. నియోజకవర్గం మైనింగ్ మాఫియా చేతుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ రాష్ట్ర కమిటీ మెంబరు బొట్టా నాగరాజు మాట్లాడుతూ దళితుల ప్రాణాలు, భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. సమస్యను పట్టించుకోకపోతే బీఎస్పీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని బాధితులకు అండగా నిలిచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతు రమణ, సీపీఎం నాయకులు చిరంజీవి, బహుజన్ నాయకులు మట్ల చంటిబాబు, బాధిత రైతులు అప్పారావు, పెంటయ్య, గణేష్, సత్తిబాబు, సతీష్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.