
గంజాయి వ్యాపారులపై పోలీసుల దాడి
● కేసు నమోదు, ముగ్గురు అరెస్ట్ ● 60 కిలోల గంజాయి స్వాధీనం, ఒక ఆటో రెండు మొబైల్ ఫోన్లు సీజ్
రోలుగుంట : మండలంలో గంజాయి వ్యాపారం చేస్తున్న రూట్లలో స్థానిక ఎస్‌ఐ రామకృష్ణారావు సిబ్బందితో కలసి కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలించడానికి వినియోగించిన ఆటోను సీజ్ చేశారు. మూడు బస్తాల్లో ఉన్న 60 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి. నిందితులు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మడిమబంద గ్రామానికి చెందిన వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి రత్నంపేటలో జీడితోటలో దాచారు. అక్కడ నుంచి ఆదివారం ఆటోలో గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పోలీసు దాడుల్లో పట్టుబడ్డారు. ఆటోలో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటోని సోదా చేసి మూడు బస్తాల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఊడి రమణబాబు(25) (ఇతనిపై పాత కేసు ఉంది), ఆర్లి శ్రీను(29) (ఇతనిపై నాలుగు గంజాయి కేసులు ఉన్నాయి), అల్లూరి జిల్లా చింతపల్లి మండలానికి చెంది మడిమబంద గ్రామానికి చెందిన కొర్రా సూరిబాబు(53) ఉన్నారు. నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండుకు తరలించినట్టు ఎస్‌ఐ విలేకరులకు తెలిపారు.