
‘అంధుడినని మేనమామ మోసగించాడు’
మాట్లాడుతున్న వెంకటరమణమూర్తి
డాబాగార్డెన్స్ (విశాఖ): తన అంధత్వాన్ని అడ్డు పెట్టుకుని మేనమామ గంప సత్యనారాయణమూర్తి తనను దారుణంగా మోసగించాడని నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన బొల్లప్రగడ వెంకటరమణమూర్తి తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో బొల్లాప్రగడ అప్పన్న మోహనరావు, చంద్ర రాజ్యలక్ష్మితో కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. చెట్టుపల్లి గ్రామంలో తన పేరిట ఉన్న ఎకరా 54 సెంట్ల భూమిని మోసగించి, ఆయన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని గమనించి, కొందరు సన్నిహితులు విజయనగరం జిల్లా పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 17న అన్ని ఆధారాలు సబ్‌రిజిస్ట్రార్‌కు అందజేసి భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయించినట్టు చెప్పారు. ఈ విషయమై అమరావతిలో సీఎం, డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశానన్నారు. అంధుడనైన తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకుని, తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.