
రైతులకు నీటి తీరువా నోటీసులు తగదు
మునగపాక: నీటి తీరువా బకాయిలు చెల్లించాలని రైతులకు ప్రభుత్వం డిమాండ్ నోటీసులు పంపడం సరికాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం నుంచి వ్యవసాయ పెట్టుబడులకు ఎటువంటి సాయం అందక అవస్థలు పడుతుంటే రెవెన్యూ అధికారులు నీటి తీరువాలు చెల్లించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆదివారం ఆయన మునగపాకలో పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగునీటి వనరులు అధ్వానంగా ఉన్నా రైతులకు న్యాయం చేయకుండా వారిపై భారం పడేలా నీటి తీరువా చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇంతవరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయలేదన్నారు. ఆరు నెలల పాటు పంట పొలాలకు పుష్కలంగా నీరందించడం ద్వారా నీటి తీరువా వసూలు చేస్తుంటారన్నారు. అయితే మండలంలో అటువంటి పరిస్థితులు లేవన్నారు. సాగునీటి కాలువలు పలు చోట్ల అధ్వానంగా ఉన్నాయన్నారు. దీంతో సాగునీరు పంటలకు అందే పరిస్థితులు లేవన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. నీటి తీరువా వసూళ్లకు సంబంధించి రైతులపై ఒత్తిడి తీసుకువస్తే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.