ఏపీఐఐసీ భూముల్లో కూటమి దోపిడీ.! | - | Sakshi
Sakshi News home page

ఏపీఐఐసీ భూముల్లో కూటమి దోపిడీ.!

Jul 28 2025 7:50 AM | Updated on Jul 28 2025 7:50 AM

ఏపీఐఐసీ భూముల్లో కూటమి దోపిడీ.!

ఏపీఐఐసీ భూముల్లో కూటమి దోపిడీ.!

నక్కపల్లి: విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగంగా కంపెనీల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో గ్రావెల్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి నాయకుల దోపిడీకి అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఈ దందా వెనుక నిర్వాసిత గ్రామాల్లోని ఓ సర్పంచ్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఈ సర్పంచ్‌ దగ్గరుండి ప్రభుత్వ భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. లారీ గ్రావెల్‌ లోడుకు రూ.1000 చొప్పున సర్పంచ్‌ వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇలా వసూలు చేసిన మొత్తంలో సగం తనకి, మిగతా సగం మండల స్థాయి నాయకుడికి ఇస్తున్నానని ప్రచారం కూడా చేస్తున్నాడని ఆయా గ్రామాల్లో చెప్పుకుంటున్నారు.

విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం ప్రభుత్వం చందనాడ, అమలాపురం, వేంపాడు, డీఎల్‌పురం, రాజయ్యపేట గ్రామాల్లో వేలాది ఎకరాలు సేకరించింది. ఈ భూముల్లో విలువైన ఖనిజ సంపద ఉంది. సముద్రపు ఇసుకతో పాట, నాణ్యమైన గ్రావెల్‌ లభిస్తోంది. మంచి ధర లభించే గ్రావెల్‌ కొండలు సైతం ఉన్నాయి. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ పనులు చేపట్టారు. దీని కోసం పరిహారం చెల్లించిన భూముల నుంచి గ్రావెల్‌ తవ్వుకుని రోడ్డు పనుల కోసం వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కూటమిలో ఉన్న సర్పంచ్‌ తమ గ్రామానికి పక్కనే ఉన్న చందనాడ సర్వే నంబరు 83లో ఉన్న గ్రావెల్‌ను రోజూ పొక్లెయిన్ల సాయంతో తవ్వించి పృధ్వీ అనే కాంట్రాక్ట్‌ సంస్థకు తరలిస్తున్నారు. భారీ టిప్పర్లతో సమీపంలో ఉన్న కంపెనీలకు, ఏపీఐఐసీలో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చందనాడ గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు తవ్వకాలు ఆపేశారు. ప్రస్తుతం యథావిధిగా తవ్వకాలు సాగుతున్నట్టు తెలిసింది.

నిత్యం పర్యటిస్తున్నా.. కనిపించని తవ్వకాలు

నిత్యం వందలాది లారీల్లో గ్రావెల్‌ను తరలించేస్తున్నా ఏపీఐఐసీ అధికారులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. మండల స్థాయి అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ నాయకులకు ఆ సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించడం, అదనపు భూసేకరణ కోసం ప్రతిరోజు అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నా ఈ అక్రమ తవ్వకాలు కనిపించకపోవడం గమనార్హం. ఒకరిద్దరు అధికారులు టిప్పర్లను కొనుగోలు చేసి ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న పనుల వద్ద గ్రావెల్‌ తరలింపునకు లీజుకు ఇచ్చినట్లు సమాచారం. కారిడార్‌ భూముల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకోకపోతే ఆయా ప్రాంతాలకు తామే వెళ్లి అడ్డుకుంటామని మరోవైపు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు వీసం రామకృష్ణ హెచ్చరించారు. పరిహారం చెల్లించిన భూములను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుని కాపలా పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికై నా గ్రావెల్‌ దందాకు అడ్డుకట్ట వేయాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

రాత్రి పూట యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

ప్రతి లారీ లోడు నుంచి రూ.1000 వసూలు చేస్తున్న ఓ సర్పంచ్‌

అటువైపు కన్నెత్తి చూడని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement