
కష్టపడినా... కడుపు నిండదు
సాక్షి, అనకాపల్లి: ఇంట్లో ఎవరికై నా అనారోగ్యం సోకి మంచాన పడితే సొంత మనుషులే సేవ చేయలేని రోజులివి. అన్నీ మంచం మీదే చేయాల్సి వస్తే మరింత యాతన. అలాంటి రోగులను కూడా సొంత మనుషుల కంటే మిన్నగా చూసుకునే బడుగుజీవులు వారు. బతుకుతెరువు కోసం దుర్భరమైన.. క్లిష్టమైన వృత్తిలో కొనసాగుతున్నారు. వారికిచ్చే వేతనాలు అంతంతమాత్రమే. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు, రోగుల సంరక్షకుల దుస్థితి ఇది.
విధులకు తగ్గ వేతనం ఏదీ?
రోగులకు అమ్మలా అన్నం తినిపిస్తారు. వేళకు మందులిస్తారు. దగ్గరుండి బాత్రూమ్‌కు తీసుకెళ్తారు. రోగులు వాంతులు.. మల మూత్రాదులు చేస్తే శుభ్రం చేస్తారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుతారు. వాడి పడేసిన సిరంజిలు, ఇంజక్షన్లు తదితర ప్రమాదకరమైన బయో వ్యర్థాలు బయటికి తరలిస్తారు. ఇలా నెలలో 30 రోజులూ గైర్హాజరీ లేకుండా పనిచేస్తే.. వారికిచ్చే వేతనం కోతలు పోనూ కేవలం తొమ్మిది.. పది వేల రూపాయలు. ఇలా జిల్లా ఆస్పత్రి, ఒక ఏరియా ఆస్పత్రి, ఆరు సీహెచ్‌సీలలో పనిచేసే 165 కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు జీతాలు లేక పలు ఇబ్బందులకు లోనవుతున్నాయి. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా వారి జీతంలో సగం కూడా అందడం లేదు.
గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ఇలా..
ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో టెండర్లు పిలిచినప్పుడు నెలకు రూ.16 వేలు (ఈఎస్‌ఐ, పీఎఫ్ పోను) ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నాడు. యలమంచిలి, నక్కపల్లి, కోటవురట్ల, మాడుగుల, చోడవరం, కె.కోటపాడు సీహెచ్‌సీలలో అయితే ఇచ్చేది రూ.9 వేలే. అది కూడా మూడు నెలల జీతాలు నిలిపివేశారు. కార్మికులు సమ్మె చేస్తే వెయ్యి పెంచుతున్నారు. మిగిలిన రూ.6 వేలు కాంట్రాక్టర్ జేబులోకి వెళ్తున్నాయనే ఆరోపణలు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈఎస్‌ఐ, పీఎఫ్ విషయానికొస్తే 12 శాతం సిబ్బంది జీతానికి యజమాని 12 శాతం కలిపి పీఎఫ్‌కు జమ చేయాలి. కానీ మొత్తం 24 శాతం సిబ్బంది నుంచే కలెక్ట్ చేసినా.. పీఎఫ్‌కి సక్రమంగా కట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో 30 మంది పారిశుధ్య కార్మికులు, 25 మంది సెక్యురిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో 20 మంది పారిశుధ్య కార్మికులు, 10 మంది సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. ఆరు సీహెచ్‌సీలలో కాంట్రాక్ట్ కార్మికులు 80 మంది పనిచేస్తున్నారు.
దీనావస్థలో ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు
చాలీచాలని జీతంతో నిత్యం వెతలే..
నెలకు రూ.16 వేలు వేతనమని చెప్పి.. రూ.9 వేలే ఇస్తున్న కాంట్రాక్టర్
3 నెలలుగా వేతన బకాయిలు
165 మంది కార్మికుల ఆకలి కేకలు
కలెక్టర్ దృష్టి సారించాలి
ప్రభుత్వం మారినప్పుడల్లా కార్మికులను తొలగించే ప్రక్రియను మానుకోవాలి. నెల మొత్తం సెలవు లేకుండా పనిచేస్తే రూ.10 వేల జీతం వస్తుంది. అది కూడా మూడు నెలలకొకసారి ఇస్తున్నారు. డ్యూటీ సమయం కన్నా.. అదనంగా మూడు నుంచి నాలుగు గంటల పాటు డ్యూటీ చేయించుకుంటున్నారు. టాయిలెట్ల క్లీనింగ్‌కు ఫినైల్, తుడవడానికి చీపుళ్లు కూడా అరకొరగానే ఇస్తున్నారు. ఎవరైనా అడిగితే రాజకీయ నాయకుల పేర్లతో వారిని తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. కొంతమందిని ఇప్పటికే తొలగించారు. ఎన్టీఆర్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ౖచైర్‌పర్సన్‌గా ఉన్న కలెక్టర్ గారు ఆస్పత్రిపై దృష్టి సారించాలి.
– కోన లక్ష్మణ్, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్
జిల్లా ప్రధాన కార్యదర్శి

కష్టపడినా... కడుపు నిండదు

కష్టపడినా... కడుపు నిండదు

కష్టపడినా... కడుపు నిండదు