
వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం
అనకాపల్లి: జాతీయ రహదారిపై కొత్తూరు పంచాయతీ పరిధిలోని ఏఎంఏఎల్ కళాశాల జంక్షన్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం దుండగుల దాడిలో పాక్షికంగా ధ్వంసమైంది. శనివారం అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్ విగ్రహం కుడి కన్నును పాక్షికంగా పగలగొట్టారు. విషయం తెలుసుకున్న కొత్తూరు పంచాయతీ సర్పంచ్ సప్పారపు లక్ష్మీ ప్రసన్న, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆదివారం ఉదయం విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జానకీరామరాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణానంతరం కొత్తూరు ప్రజలు 2010లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇన్నాళ్ల తర్వాత స్థానికుల మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. విగ్రహాలను కూల్చే సంస్కృతి అనకాపల్లి నియోజకవర్గంలో లేదని, ఇందుకు కారకులైన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ సప్పారపు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ 2010 సెప్టెంబర్ 2న వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఆయన అభిమానుల మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం సరికాదన్నారు. వెంటనే విగ్రహానికి మరమ్మతులు చేపట్టి, నాయకులు పూలమాలలు వేసి వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు పట్టణ సీఐ టి.వి.విజయకుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, 80వ వార్డు ఇన్‌చార్జ్ కె.ఎం.నాయుడు, నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, గవర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, కొత్తూరు ఎంపీటీసీ మురుగుతి సంతోష్‌కుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరిపై కేసు నమోదు
కొత్తూరు పంచాయతీ ఏఎంఎఎల్ కళాశాల జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్న ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు తెలిపారు. వారు ఘటనా స్థలాన్ని సందర్శించి, సమీపంలోని సీసీ పుటేజీ పరిశీలించారు. ఉల్లింగల శ్రీను, ఒక మైనర్ మద్యం తాగిన మైకంలో గొడవ పడ్డారని, మైనర్ ఉల్లింగల శ్రీనుపై రాయి విసరడంతో వైఎస్సార్ విగ్రహానికి తగిలి పెచ్చులు ఊడిపోయిందని సీఐ టి.వి.విజయకుమార్ చెప్పారు. వీరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
ఆవేదన చెందిన అభిమానులు
వెంటనే విగ్రహానికి మరమ్మతులు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం