
బహిరంగంగా బరితెగింపు
నర్సీపట్నం: పట్టణం నడిబొడ్డున ఉన్న బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల ప్రదేశంలో మెయిన్ రోడ్డు ను అనుకుని బహిరంగంగా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇది పురావస్తు శాఖకు చెందిన భూమి అంటూ.. ప్రధాన రోడ్డు వైపు కట్టిన ఆకుపచ్చని మ్యాట్‌ని శనివారం మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. అయితే యథావిధిగా మళ్లీ పరదాను కట్టి ఆదివారం పక్కా భవనాల నిర్మాణం కోసం పిల్లర్స్ వేయటం మొదలు పెట్టారు. ఇది పురావస్తుశాఖ స్థలం అంటూ హడావుడి చేసిన అధికారులెవరూ ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. వాస్తవంగా ప్రస్తుతం నిర్మాణా లు చేస్తున్న వారంతా మూడు దశాబ్ధాలకు పైగా ఈ ప్రదేశంలో దుకాణాలు నిర్మించుకుని జీవనం సాగించేవారు. ప్రధాన రోడ్డు విస్తరణ సమయంలో వీరంతా స్వచ్ఛందంగా దుకాణాలను తొలగించగా, ఇదే స్థలంలో ఉన్న మరో దుకాణదారుడు ఆర్థిక స్తోమతు ఉండడంతో దుకాణం తొలగించకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో రోడ్డు విస్తరణ పూర్తికాలేదు.
పరిరక్షించాలని పిటిషన్
అల్లూరి సీతారామరాజు పోరాటానికి చిహ్నంగా ఉన్న బ్రిటిష్ సైనికాధికారులు లియోనెల్ నెవెల్లీ హైటర్, క్రిస్టోఫర్ విలియం స్కాట్ కవర్ట్‌ల సమాధుల స్థలాన్ని పరిరక్షించాలని అల్లూరి సీతారామరాజు స్మారక కమిటీ కన్వీనర్ పి.వి.సత్యనారాయణరావు కోర్టులో పిటిషన్ వేశారు. స్పందించిన సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ అధికారులతో కలిసి బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలాన్ని ఈ నెల 10న క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. చాలా వరకు స్థలం అక్రమణకు గురైందని, పురావస్తుశాఖకు చెందినదిగా 2011లోనే నోటిపై చేసినా, స్థలాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు లేకపోవటం వల్ల పరిరక్షణ చర్యలు తీసుకోలేకపోయామని పురావస్తుశాఖ సహాయ సంచాలకులు ఫల్గుణరావు న్యాయమూర్తికి వివరించారు. స్థలం అన్యాక్రాంతం కాకుండా తాత్కాలికంగా రక్షణ చర్యలైనా చేపట్టాలని జడ్జి మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. ఇది జరిగిన రెండు వారాలకు దుకాణదారులు స్థలం చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టి పక్కా దుకాణాల నిర్మాణానికి పూనుకున్నారు. న్యాయమూర్తి ముందు స్థల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్న పురావస్తు, రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు ఆదివారం సెలవు దినం పేరుతో మొహం చాటేశారు. అనుమతులు లేకుండా ఏ చిన్న నిర్మాణం చేపట్టినా ఇట్టే వాలిపోయే టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం కానరాలేదు.
పరదా మాటున చకచకా నిర్మాణం
బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల పరిరక్షణకు విఘాతం
కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం

బహిరంగంగా బరితెగింపు