
బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేయాలి
ఎస్.రాయవరం: బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలు తక్షణమే విడుదల చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.కె.ఎల్.ఎన్.ధర్మారావు, ఎస్.దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. అడ్డురోడ్డులో ఆదివారం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బదిలీలు నిర్వహించి నెల రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. జూలై నెల జీతాలు కూడా ఇదే వంకతో ఆలస్యం చేసే అవకాశం ఉందన్నారు. వేలాదిమంది ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. బదిలీ అయినా రిలీవర్ లేరన్న వంకతో ఉపాధ్యాయులను అక్కడే ఉంచేస్తున్నారని, వారిని వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిన స్థానాలకు పంపాలన్నారు.