
పదోన్నతి అంటే మరింత బాధ్యత
● ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: పోలీస్ శాఖలో పదోన్నతి అనేది గౌరవం మాత్రమే కాదని, మరింత బాధ్యత పెరిగినట్టు అని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పని చేస్తున్న 1990 బ్యాచ్ హెడ్ కానిస్టేబుళ్లు 25 మంది ఏఎస్‌ఐగా పదోన్నతి పొందారు. స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారి కార్యాలయంలో శుక్రవారం వీరితో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐగా పదోన్నతి కల్పించడం జిల్లా పోలీసు శాఖ గర్వపడుతుందన్నారు. వీరిలో 16 మందిని అనకాపల్లి జిల్లా పోలీస్ యూనిట్‌కు, 9 మందిని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించామన్నారు. కొత్త హోదాలో మరింత నిబద్ధతతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. పనితీరును నిరంతరం మెరుగుపరుచుకుంటూ పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బీమా భాయ్, సిబ్బంది పాల్గొన్నారు.